: ఉపాధి అవకాశాలు శరవేగంగా తగ్గుతున్న రంగాలివి.. మీరెక్కడున్నారు?


నాలుగో పారిశ్రామిక విప్లవం మొదలైందని, అందివచ్చిన అధునాతన సాంకేతికత అన్ని రంగాల్లోకి చొచ్చుకుపోతుండగా, వచ్చే పదేళ్ల వ్యవధిలో వివిధ సెక్టార్లలో ఉపాధి అవకాశాలు మృగ్యం కానున్నాయని దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో వక్తలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన మెర్రిల్ లించ్ ఓ నివేదికను విడుదల చేస్తూ, టెక్నాలజీ కారణంగా 47 శాతం మేరకు ఉద్యోగాల్లో కోత పడనుందని పేర్కొంది. ఈ రిపోర్టులోని సమాచారం ప్రకారం, వివిధ రంగాల్లో లక్షలాది మంది ఉద్యోగాలను పోగొట్టుకోనున్నారు. ఇక మెర్రిల్ లించ్ నివేదిక ప్రకారం... వ్యవసాయం: పెరిగిన యాంత్రికతతో కూలీల అవసరం తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో 2 శాతం మంది మాత్రమే ప్రత్యక్షంగా వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతుండగా, ఇండియాలో 50 శాతం మంది జనాభా భూమిపైనే ఆధారపడివున్నారు. విత్తనాలు నాటడం నుంచి నీరు పెట్టడం, పురుగుమందులు చల్లడం, కోత వరకూ యంత్రాలే పనిచేస్తుండంతో మానవ శక్తికి డిమాండ్ తగ్గుతోంది. వ్యవసాయాన్ని మరింతగా యాంత్రీకరిస్తూ, కార్పొరేట్ సంస్థలు, వ్యాపారవేత్తలూ పంటల రంగంలోకి ప్రవేశిస్తుండటంతో, మట్టిని నమ్ముకున్న కూలీలకు ఉపాధి తగ్గిపోనుంది. ఫ్యాక్టరీ వర్కర్లు: ఈ విషయంలో జపాన్ లో ఇప్పటికే కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జపాన్ వాహన పరిశ్రమలో ప్రతి 10 వేల మంది కార్మికుల్లో 1,500కు పైగా రోబోలు ఉన్నాయి. రోబోలను వాడితే, ఖర్చు గణనీయంగా తగ్గుతుందన్న యాజమాన్యాల ఆలోచన, కార్మికులకు ఆందోళన కలిగిస్తోంది. రోబోల తయారీ విస్తరించడంతో, ఫ్యాక్టరీల్లోకి ఇవి శరవేగంగా దూసుకొస్తూ, ప్రజల పొట్ట గొడుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఇండియాకు ఈ భయం లేకపోయినా, వచ్చే 20 ఏళ్లలో, అంటే తదుపరి తరం ఉపాధికి రోబోలు గండికొట్టడం ఖాయమే. న్యూస్ రిపోర్టర్లు: 'వర్డ్ స్మిత్' రాకతో విలేకరులకు పని తగ్గిపోయింది. ప్రపంచ ప్రసిద్ధ న్యూస్ ఏజన్సీ అసోసియేటెడ్ ప్రెస్ ఇప్పటికే నెలకు 3 వేల ఫైనాన్షియల్ వార్తలను వర్డ్ స్మిత్ ఉపయోగించి అందిస్తోంది. వికీపీడియాలోని 8.5 శాతం కంటెంట్ ను రోబోలే రాశాయి. ఇదే సమయంలో ప్రింట్ మీడియాకు వ్యాపార ప్రకటనలు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ స్థాయిలో విలేకరుల సంఖ్యను దినపత్రికలు తగ్గించుకుంటున్నాయి. తెలుగు వంటి ప్రాంతీయ భాషలకు వర్డ్ స్మిత్ వంటి సాఫ్ట్ వేర్ ప్రస్తుతానికి అందుబాటులో లేకపోయినప్పటికీ, భవిష్యత్తులో అటువంటిది వస్తే, ఆ ఇబ్బంది ఇక్కడ కూడా తప్పదు. ఉపాధ్యాయులు: ఎక్కువగా ఉపాధి అవకాశాలను దూరం చేస్తున్న మరో విభాగం విద్యా రంగం. ఆన్ లైన్ కాలేజీలు, ఆన్ లైన్ డిగ్రీలు అంటూ యువత ఇప్పుడిప్పుడే ఇంటర్నెట్ బాట పడుతోంది. ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసించే వారు నెట్ బాటలో నడుస్తున్నారు. దీంతో అధ్యాపకులకు డిమాండ్ క్రమంగా తగ్గుతోంది. ప్రాథమిక విద్య వరకూ మాత్రం ఈ మార్పు ఇంకా చోటుచేసుకోవడం లేదు. హెల్త్ వర్కర్లు: ఇంట్లోనే బీపీ టెస్ట్, ఇంట్లోనే షుగర్ టెస్ట్, ఇంట్లోనే గర్భదారణ పరీక్షలు... ఇలా అందివచ్చిన సాంకేతికత వివిధ రకాల పరీక్షలను ఇంట్లోనే చేసుకునేలా చేస్తుండటంతో వైద్య రంగంలో ఎంతో మందికి ఉపాధి కరవవుతోంది. ఇప్పుడిప్పుడే స్మార్ట్ ఫోన్లు సైతం ఈ రంగంలోకి వచ్చేశాయి. రోజుకు ఎంత నడిచాం? ఎంత వ్యాయామం చేస్తే, ఎంత శక్తి ఖర్చయింది. శరీరంలో చక్కెర శాతం ఎంత? వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఎప్పుడు ఏ మందులు వాడాలని చెప్పే యాప్ లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ వైద్య రంగంలో ఉపాధిని హరిస్తున్నవే. న్యాయవాదులు: ఈ రంగంలో జూనియర్లకు ఉపాధి కరవవుతోంది. లీగల్ - జూమ్ వంటి సాఫ్ట్ వేర్లు జూనియర్ న్యాయవాదులు చేయాల్సిన అన్ని పనులనూ చక్కబెడుతూ న్యాయమూర్తి ముందు నిలిచి వాదనలు వినిపించే సీనియర్లకు చేదోడుగా ఉంటున్నాయి. దీంతో ఏదైనా కేసులు విచారించాల్సిన సమయంలో సెక్షన్లు, పాత కేసుల్లో తీర్పులు తదితరాల కోసం కంప్యూటర్ ముందు కూర్చుంటే సరిపోయే పరిస్థితితో ఎంతో మంది యువతకు ఉపాధి దెబ్బతింటోంది. ఎకౌంటెంట్లు: జమా ఖర్చులను రాస్తూ, ఎన్నో కంపెనీల్లో రాత పనులు చేసే వారి ఉద్యోగాలకూ ఎసరు వచ్చింది. వీరి స్థానాన్ని కంప్యూటర్లు ఆక్రమించేశాయి. టీడీఎస్ నుంచి ఉద్యోగులకు జమ చేయాల్సిన పెన్షన్ల వరకూ, పైసా పైసా లెక్కలను ఒక్క క్లిక్ తో చూపించే సాఫ్ట్ వేర్ లు ఎన్నో వచ్చేశాయి. వచ్చే పదేళ్లలో మానవ ఎకౌంటెంట్ల అవసరం ఎంతమాత్రం ఉండదని అంచనా. ఈ రంగాలతో పాటు మానవ రహిత కార్లతో డ్రైవర్లు, ఆర్ఎఫ్ఐడీ చిప్ లు, ఆటోమేటెడ్ స్కానర్లు, క్రెడిట్, డెబిట్ కార్డులు, సెల్ఫ్ చెకౌట్లతో క్యాషియర్లకు పని లేకుండా పోనుంది. టెలీ కాల్ సెంటర్ ఉద్యోగాలకూ ఎసరు పడనుందని మెర్రిల్ లించ్ అంచనా వేసింది. ఆతిథ్య రంగంలో సైతం రోబోలు ప్రవేశించి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వచ్చే 20 ఏళ్లలో ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నవారిలో 50 శాతం మందితోనే పని జరిగిపోతుందని మిగతా అంతా ఆటోమేషన్ మయమవుతుందని మెర్రిల్ లించ్ అంచనా.

  • Loading...

More Telugu News