: రూ. 4 కోట్లతో సినిమా తీసి... నచ్చక ఉరేసుకున్న మలయాళ నిర్మాత!
ఆయన పేరు అజయ్ కృష్ణన్ (29)... మలయాళ చిత్ర పరిశ్రమలో రాణించాలన్నది అతని కల. అందుకు ఎంతో శ్రమించాడు. దొరికిన వారందరి దగ్గరా అప్పులు చేశాడు. రూ. 4 కోట్లు పెట్టి సినిమా తీశాడు. విడుదలకు ముందు దాన్ని ప్రివ్యూ వేసుకుని చూశాడు. ఆ సినిమా అతనికే నచ్చలేదు. ఈ చిత్రం హిట్ కాదని అనుకుని, బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. కేరళలోని కొల్లాం సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. నిర్మాతగా మారిన అజయ్ కృష్ణన్, అసిఫ్ అలీ, ఉన్ని ముకుందన్ ముఖ్య పాత్రల్లో 'అవరుడే రవుకల్' పేరిట ఓ చిత్రాన్ని నిర్మించాడు. సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ ముగిశాయి. రెండు రోజుల క్రితం కొచ్చిలో పూర్తి సినిమాను చూసినప్పటి నుంచి ఆయన తీవ్ర మానసిక వేదనకు లోనయ్యాడు. ఇది హిట్ కాదని, తాను పూర్తి అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయమని పలుమార్లు తల్లిదండ్రులతో చెప్పాడట. ఈ నేపథ్యంలోనే గత రాత్రి, తన ఇంట్లో ఉరి వేసుకుని అత్మహత్యకు పాల్పడ్డాడు అజయ్. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.