: భారత జాతి యావత్తునూ మోసం చేసిన మాల్యా!


యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యా యావత్ భారత దేశాన్ని, న్యాయ వ్యవస్థనూ, రాజ్యాంగాన్నీ మోసం చేశాడా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, వస్తున్న వార్తలను చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. పార్లమెంట్ సభ్యుడిగా, ప్రజా జీవితంలో ఉన్న ఆయన, ఎన్నో నిజాలను దేశ ప్రజల ముందు దాచి వుంచినట్టు తెలుస్తోంది. బ్రిటన్ పౌరసత్వం, అక్కడి చిరునామాలో ఓటు హక్కు ఆయనకు ఉన్నాయని తాజాగా వార్తలు వెలువడటం సంచలనాన్ని కలిగిస్తోంది. అదే నిజమైతే, భారత పాస్ పోర్టును రద్దు చేసినా ఆయనకు కలిగే నష్టం ఇసుమంతైనా ఉండదు సరికదా, తమ పౌరుడిని అప్పగించేందుకు బ్రిటన్ ససేమిరా అంటుంది. దీంతో ఆయన్ను ఇండియాకు తెచ్చి చట్టం ముందు దోషిగా నిలిపే అవకాశం దాదాపు లేనట్టేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లండన్ కు కూతవేటు దూరంలో ఉన్న 'లేడీ వాక్' అనే మూడంతస్తుల నివాసభవనం తన అధికారిక చిరునామా అంటూ, 'ది సండే టైమ్స్'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు కూడా. దీని యాజమాన్య హక్కులు పూర్తి చట్టబద్ధమేనని ఆయన తెలిపారు. 1992 నుంచే ఆయన బ్రిటన్ పౌరుడిగా ఉన్నాడట. అయితే, ఈ విషయాన్ని రాజ్యసభకు నామినేట్ అవుతున్న వేళ, సమర్పించే అఫిడవిట్ లో ఆయన పేర్కొనలేదు. ఇది జాతి ద్రోహమే. తాను బ్రిటన్ పౌరుడినన్న విషయాన్ని తెలిపితే, ఇక్కడ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కదు. ఈ విషయాన్ని ఉద్దేశపూర్వకంగా దాచి ఆయన ప్రజలందరినీ మోసం చేశాడని ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మాల్యాను ఎలాగైనా దేశానికి తిరిగి రప్పిస్తామని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పినప్పటికీ, అదేమంత సులభమైన విషయం కాదు. విదేశాంగ శాఖ ఆయన పాస్ పోర్టును రద్దు చేస్తున్నట్టు ప్రకటించినా, ఓ బ్రిటన్ పౌరుడిగా, అక్కడి పాస్ పోర్టును పొందడం మాల్యా లాంటి వ్యక్తికి అంత కష్టమేమీ కాదు. అసలు ఆయనకు ఇప్పటికే బ్రిటన్ పాస్ పోర్టు ఉండవచ్చని కూడా అనుమానాలున్నాయి. ఇక భారత చట్టాలను తాను గౌరవిస్తానని, ఇక్కడి న్యాయవ్యవస్థపై నమ్మకముందని చెప్పే మాల్యా, తాజా ఆరోపణలపై ఇంకా నోరు మెదపలేదు.

  • Loading...

More Telugu News