: హత్యాయత్నమంటూ అబద్ధం చెప్పిన కన్నయ్య... జెట్ ఎయిర్ వేస్ విమానంలో అసలేం జరిగిందంటే..!
ముంబై నుంచి పుణెకు బయలుదేరే జెట్ ఎయిర్ వేస్ విమానంలో బీజేపీ కార్యకర్త, టీసీఎస్ ఉద్యోగి ఒకరు తనను హత్య చేసేందుకు ప్రయత్నించాడని, అతనిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విద్యార్థి నేత కన్నయ్య కుమార్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి విమానంలో గొడవకు దిగింది కన్నయ్య కుమారేనట. సీటు విషయంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవగానే దీన్ని పరిగణించాలి తప్ప, హత్యాయత్నాలు ఏమీ జరగలేదని తమ ప్రాథమిక విచారణలో తేలినట్టు ముంబై షహర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఓ ప్రయాణికుడు తనకు కేటాయించిన విండో సీటులో కూర్చునేందుకు ప్రయత్నిస్తూ, అడ్డుగా ఉన్న కన్నయ్యను తగలడంతో వివాదం జరిగిందని తెలిపారు. ఇతర ప్రయాణికులు, విమాన సిబ్బంది సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారని ఆయన తెలిపారు. అయినప్పటికీ, కన్నయ్య చేసిన ఆరోపణలపై విచారణ కొనసాగించనున్నామని, మరింత మంది స్టేట్ మెంట్లను నమోదు చేస్తామని వివరించారు.