: బ్రిటన్ కుబేరుల జాబితాలో... ఫస్ట్, సెకండ్ స్థానాలు మనోళ్లవే!
భారత్ ఏళ్ల తరబడి బ్రిటన్ పాలకుల చెప్పు చేతల్లో ఉండిపోయింది. సుదీర్ఘంగా సాగిన స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటిష్ పాలకులు ఎట్టకేలకు భారత్ ను విడిచిపెట్టిపోయారు. తదనంతర కాలంలో భారత్ కు చెందిన పలువురు వ్యాపారవేత్తలు ట్రిటిష్ గడ్డపై కాలు మోపారు. మెరుగైన పనితీరుతో సత్తా చాటుతున్నారు. ఎంతగానంటే... అక్కడి వారి కంటే ఆస్తిపాస్తుల్లో అగ్రగణ్యులుగా రాణిస్తున్నారు. మొన్నటిదాకా ఉక్కు దిగ్గజం లక్ష్మి మిట్టల్ సత్తా చాటగా... తాజాగా రూబెన్ బ్రదర్స్ అక్కడి కుబేరుల జాబితాలో మెరిశారు. ‘ద సండే టైమ్స్’ పత్రిక నిన్న ‘బ్రిటన్ రిచెస్ట్-2016’ పేరిట వెల్లడించిన కుబేరుల జాబితాలో ముంబైకి చెందిన రూబెన్ బ్రదర్స్ గా పేరుగాంచిన డేవిడ్ రూబెన్, సైమన్ రూబెన్ లు తొలి స్థానంలో నిలిచారు. ఇక హిందూజా బ్రదర్స్ గా పిలుచుకుంటున్న శ్రీచంద్ హిందూజా, గోపీచంద్ హిందూజాలు రెండో స్థానం దక్కించుకున్నారు. ఇరాకీ జూయిష్ జాతికి చెందిన రూబెన్ బ్రదర్స్ ముంబైలోనే జన్మించారు. తదనంతర కాలంలో వారు బ్రిటన్ లో స్థిరపడ్డారు. రూబెన్ బ్రదర్స్ ఆస్తుల విలువను 1,310 కోట్ల పౌండ్లుగా, హిందూజా బ్రదర్స్ ఆస్తులను 1,300 కోట్ల పౌండ్లుగా ‘ద సండే టైమ్స్’ లెక్కగట్టింది.