: పోయేవారిపై ఆగ్రహం, ఉన్నవారిపై అపనమ్మకం... విలవిల్లాడుతున్న జగన్!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, తన పార్టీ నుంచి వలస వెళుతున్న వారిని ఎలా ఆపాలో తెలియక సతమతం అవుతున్నారు. పార్టీని వీడుతారని అనుమానం వచ్చిన వారిని బుజ్జగిస్తున్నా ఫిరాయింపులు ఆగని పరిస్థితి. ఎవరు పోతారో? ఎప్పుడు పోతారో తెలియని వైచిత్రి. పార్టీలో జగన్ తరువాత రెండు, మూడు స్థాయి హోదాల్లో ఉన్న ఎమ్మెల్యేలు భూమా, జ్యోతుల సైతం జగన్ కు హ్యాండిచ్చిన నేపథ్యంలో, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నట్టు నిన్న వార్తలు వచ్చాయి. వారిలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావులు తమ చేరికను స్పష్టం చేయగా, ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కూడా పార్టీని ఫిరాయించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఎల్లుండి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో గొట్టిపాటి టీడీపీలో చేరుతారని సమాచారం. అదే రోజున బుడ్డా, ఆ మరుసటి రోజు సర్వేశ్వరరావులు టీడీపీలోకి జంప్ కొట్టనున్నారని తెలుస్తోంది. ఒకరి తరువాత ఇంకొకరు పార్టీని వీడుతుంటే, వారిని ఎలాగైనా అడ్డుకోవడంలో జగన్ విఫలమవుతున్నారన్న విమర్శలూ వస్తున్నాయి. పోయేవారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం, ఉన్నవారు ఎప్పుడు ఫిరాయిస్తారో అన్న అనుమానాల మధ్యే ఆయనకు రోజు గడిచిపోతోంది. ఎమ్మెల్యేల ఫిరాయింపులు జగన్ కు ఊపిరిసలపనివ్వడం లేదంటే అతిశయోక్తి కాదు. చంద్రబాబు వైఖరి, ఎమ్మెల్యేల ఫిరాయింపులను అడ్డుకోవాలంటూ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీలను కలిసి ఫిర్యాదు చేసేందుకు మే మొదటి వారంలో ఢిల్లీకి వెళ్లనున్నట్టు ప్రకటించిన ఆయన, తాజా పరిణామాలతో ఈ వారం చివర్లోనే ఢిల్లీకి పయనం కావాలని నిర్ణయించారు. తమ ఎమ్మెల్యేలకు డబ్బు ఎరచూపి పార్టీలు మారేందుకు ప్రోత్సహిస్తున్నారని, వీరిపై అనర్హత వేటు వేయాలని ఆయన ఫిర్యాదు చేయనున్నారు. ప్రజా సమస్యలపై పోరాటాన్ని సైతం పక్కనబెట్టి, ఎమ్మెల్యేల వలసలను అడ్డుకోవడంపైనే దృష్టిని సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే గవర్నర్ ను కలిసి ఇదే విషయాన్ని విన్నవిస్తే, ఆయన తాను చేయగలిగిందేముందని అన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి వలసలను ఆపేందుకు జగన్ ఏ దిశగా అడుగులు వేస్తారో వేచి చూడాలి.