: విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లకు ఫ్యాన్లు పెట్టి చల్లబరుస్తున్న సిబ్బంది!


మండే ఎండల నుంచి కొంత ఉపశమనం పొందేందుకు ఇంట్లో కూలర్లు, ఏసీలు ఎవరి తాహతును అనుసరించి వారు ఏర్పాటు చేసుకుంటున్నారు. విపరీతమైన ఎండల కారణంగా ప్రజలకే కాదు, విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లకు కూడా పెద్ద తలనొప్పి వచ్చిపడింది. బాగా వేడెక్కిపోవడంతో ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోవడం, పర్యవసానంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడం జరుగుతోంది. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు గాను, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలోని జింఖానా గ్రౌండ్స్ వద్ద ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ అధికారులు ఒక కొత్త పద్ధతిని అనుసరిస్తున్నారు. ఆయా ట్రాన్స్ ఫార్మర్ల వద్ద పెద్ద సైజ్ ఫెడస్ట్రల్ ఫ్యాన్లను రెండింటిని ఏర్పాటు చేశారు. ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఈ ఫ్యాన్లను ఆన్ చేసి ఉంచుతున్నారు. తద్వారా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు వేడెక్కకుండా, పేలిపోకుండా ఉండేందుకు ఆస్కారం ఉంది. ఈ సందర్భంగా సబ్ స్టేషన్ లోని సంబంధిత ఆపరేటర్ మాట్లాడుతూ, బయటి ఉష్ణోగ్రత విపరీతంగా ఉండటంతో ట్రాన్స్ ఫార్మర్ లోని వైండింగ్ సిస్టమ్ దెబ్బతినడంతో పాటు, ఆయిల్ టెంపరేచర్ ఎక్కువైపోవడం, లోడ్ ఎక్కువ కావడం వల్ల ట్రిప్ అయిపోతుండటం జరుగుతాయని, దీనిని నివారించేందుకు ఫ్యాన్లను ఏర్పాటు చేశామన్నారు. అయితే, ట్రాన్స్ ఫార్మర్లలో ఇన్ బిల్ట్ ఫ్యాన్లు ఉన్నప్పటికీ బయటి ఉష్ణోగ్రతలు విపరీతంగా ఉండటంతో ఆయిల్ హీట్ ఎక్కి ఫీడర్లు ఎగిరిపోతాయని, వాటిని నివారించేందుకు ఫ్యాన్లు ఏర్పాటు చేసి ట్రాన్మ్ ఫార్మర్లను కూల్ చేస్తున్నామన్నారు. గంటగంటకు తాము తీసుకునే రీడింగ్ ద్వారా ఉష్ణోగ్రతలు తెలుసుకుంటామని, అవి వేడెక్కకుండా ఉండేందుకు జాగ్రత్త పడతామని అన్నారు. ఇంతకుముందెన్నడూ ఫ్యాన్లు ఏర్పాటు చేసి ట్రాన్స్ ఫార్మర్లను చల్లబరచటం జరగలేదని, ఈ విధంగా చేయడం ఇదే మొదటిసారని అన్నారు.

  • Loading...

More Telugu News