: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కన్నీరుపెట్టడం కలచివేసింది: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ కన్నీరు పెట్టడం తనను కలచివేసిందని తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సమావేశం ఢిల్లీలో ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశ వ్యాప్తంగా 38 లక్షల కేసులు పెండింగ్ లో ఉండటంపై టీఎస్ ఠాకూర్ కంటతడిపెట్టారు. ఈ సంఘటనపై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. చాలా కేసుల్లో నిందితులు సుమారు 15 ఏళ్లుగా జైలులో ఉన్నారని, ఇంకా వారిపై ట్రయల్స్ జరుగుతున్న విషయాన్ని చీఫ్ జస్టిస్ వివరించారన్నారు. కోర్టుల సంఖ్య, జడ్జి నియామకాల పెంపు అత్యవసరమన్నారు. కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తెలంగాణ సహకరిస్తుందని, కేసుల పరిష్కారం మాట అటుంచితే, ఏటా యాభై శాతం కేసులు పెరుగుతున్నాయని ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.