: కంటతడిపెట్టిన చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్


సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ ఈరోజు కంటతడిపెట్టారు. న్యాయ వ్యవస్థ సంస్కరణల పై ఢిల్లీలో ఈరోజు ఉదయం సదస్సు ప్రారంభించారు. ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు హాజరయ్యారు. దేశ న్యాయవ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సదస్సు ప్రారంభోపన్యాసంలో జస్టిస్ ఠాకూర్ మాట్లాడుతూ, మన దేశంలో న్యాయవ్యవస్థ శక్తికి మించి పనిచేస్తోందని, దేశంలో ఉన్న భారమంతా న్యాయ వ్యవస్థపై మోపడం సరికాదని అన్నారు. న్యాయవ్యవస్థపై సామాన్యుడి నమ్మకం సన్నగిల్లిపోతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనై కంటతడిపెట్టారు. ప్రసంగాన్ని ఆపి, కర్చీఫ్ తీసుకుని కళ్లు తుడుచుకున్నారు. అనంతరం ప్రసంగాన్ని కొనసాగిస్తూ, న్యాయ వ్యవస్థపై పని ఒత్తిడి తగ్గించడానికి, పనితీరు మెరుగుపరచడానికి తీసుకోవలసిన చర్యల విషయంలో పాలనా వ్యవస్థ నిష్క్రియగా ఉండిపోవడాన్ని ఆయన ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం 21 వేలు ఉన్న న్యాయమూర్తుల సంఖ్యను 40 వేలకు పెంచాలని ఆయన సూచించారు. సకాలంలో కేసుల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని, వివిధ హైకోర్టుల్లో 38 లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. పది లక్షల జనాభాకి కేవలం 15 మంది జడ్జిలు మాత్రమే ఉన్నారని, ప్రజలకు సత్వర న్యాయం అందాలంటే కోర్టుల సంఖ్య పెంచాలని, హైకోర్టుల్లో ఖాళీగా ఉన్న 434 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, 1987 లా కమిషన్ సిఫార్సులు అమలు చేయాల్సిన అవసరం ఉందని జస్టిస్ టీఎస్ ఠాకూర్ అన్నారు. కాగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచనలకు ప్రధాని మోదీ స్పందించారు. న్యాయవ్యవస్థతో కలిసి కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను తప్పకుండా పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News