: పట్టుకున్న వారికి పట్టుకున్నంత పెట్రోలు... పెనుకొండలో క్యూ కట్టిన జనం!
అనంతపురం జిల్లా పెనుకొండ వద్ద ప్రజలు పెట్రోలు కోసం క్యూ కట్టారు. క్యాన్లు, డబ్బాలు, బిందెలు తీసుకువచ్చి మరీ పెట్రోలును తీసుకెళుతున్నారు. పిన్నా పెద్దా, ఆడా, మగా తేడా లేకుండా పెట్రోలు కోసం క్యూ కట్టారు. వివరాల్లోకి వెళితే... పెనుకొండ రైల్వే స్టేషనులో పెట్రోలును తరలిస్తున్న గూడ్స్ రైల్ ఒకటి ఆగింది. దానిలోని ఐదు వ్యాగన్ల నుంచి పెట్రోల్ లీక్ అవుతోంది. దీన్ని గమనించిన కొందరు విషయాన్ని తమ వారికి చేరవేయడంతో కథ మొదలైంది. పెట్రోల్ కారుతోందని తెలుసుకున్న జనం ఎగబడ్డారు. ఈ గూడ్స్ ముంబై నుంచి బెంగళూరు వెళుతున్నట్టు సమాచారం. కాగా, పెట్రోలును ప్రజలు తీసుకువెళుతున్నారని అధికారులకు తెలిసినప్పటికీ, ఇంకా స్పందించలేదని తెలుస్తోంది. ఆ ప్రాంతంలో చిన్న నిప్పురవ్వ పడ్డా పెను ప్రమాదం జరిగే అవకాశాలు ఉండటంతో వెంటనే పోలీసులు రక్షణాత్మక చర్యలు చేపట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది.