: సింహాద్రి అప్పన్న ఉంగరాన్ని దొంగిలించిన కాలేజీ విద్యార్థినులు... ఆపై ఏం జరిగిందో చదవండి!
వారంతా సింహాద్రి అప్పన్న దర్శనానికి వచ్చిన చదువుకునే విద్యార్థినిలు. ఎస్ కోట డిగ్రీ అమ్మాయిలు, సింహాచలం గాయత్రీ విద్యా పరిషత్ లో బీటెక్ చదువుతున్న మచిలీపట్నం అమ్మాయి, గాజువాకకు చెందిన ఇంటర్ చదువుతున్న విద్యార్థినిలు, విజయనగరం జిల్లా గంట్యాడకు చెందిన భక్తులు... వీరందరినీ తాళ్లతో కట్టి తీసుకువచ్చారు. ఆలయ ప్రధానార్చకుడు స్వయంగా వచ్చి స్వామివారి ఉంగరాన్ని మీరు దొంగతనం చేశారని ఆరోపించారు. తాము దొంగతనం చేయలేదని వారు కన్నీరు మున్నీరైనా వినలేదు. దృశ్యాలు సీసీ కెమెరాల్లో చిక్కాయని, పోలీసులు రాకముందే ఉంగరం ఇస్తే, క్షమించి వదిలేస్తామని స్థానాచార్యులు అభయమిచ్చారు. తాము ఉంగరం తీయలేదని విద్యార్థినులు నెత్తీ నోరు కొట్టుకున్నారు. చుట్టూ చూస్తున్న వారు సైతం వీరు దొంగతనం ఎందుకు చేస్తారని అనుకుంటూనే, ఓ మూల అనుమానంతో చూస్తున్నారు. ఆ సమయంలో పూజారి రాజగోపాల్ చెప్పిన ఓ మాట వారందరినీ ఆనంద పరవశంలో ముంచెత్తింది. స్వామివారి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా మృగయోత్సవం జరుగుతుందని, అందులో భాగంగా పోయిన స్వామివారి ఉంగరం వెతికే ఘట్టంలో భాగంగానే ఇలా చేశామని చెప్పి, వారిని బంధవిముక్తుల్ని చేయించారు. ఇది వినోదోత్సవమని, స్వామివారు తమకు ఇచ్చిన అపూర్వ అవకాశమని, ఈ అనుభవం జీవితాంతం గుర్తుండిపోతుందని చెప్పుకుంటూ, ఆ విద్యార్థినులు స్వామివారి దర్శనానికి వెళ్లారు. కాగా, అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చిన నవ దంపతులు, కొందరు మహిళా భక్తులు, వంటశాలలో పనిచేసే ఉద్యోగి శ్రీను తదితరులను కూడా ఇలాగే వినోదోత్సవంలో కాసేపు భాగం చేశారు ప్రధాన అర్చకులు.