: పాత సంప్రదాయం బద్దలు... 1200 ఏళ్ల నాటి మసీదులోకి మహిళలకు ఎంట్రీ
పాత సంప్రదాయాలు బద్దలవుతున్నాయి. దేవాలయాల గర్భగుడుల్లోకి మహిళలు ప్రవేశించి పూజలు జరుపుతున్న వేళ, కేరళలో ఎనిమిదవ శతాబ్దానికి చెందిన మసీదులోకి మహిళల ప్రవేశానికి ఇకపై అడ్డుచెప్పబోమని నిర్వాహకులు వెల్లడించారు. కొట్టాయంలోని జుమా మసీదు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పురాతన సున్నీ మసీదుగా ఉన్న దీన్ని సందర్శించేందుకు దేశ విదేశీ టూరిస్టులు ఎందరో వస్తుంటారు. మసీదు లోపలికి వెళ్లేందుకు గానీ, నమాజు చేసేందుకు గానీ, మహిళలకు అర్హత ఉండదు. అయితే, మసీదు లోపలి శిల్ప నైపుణ్యాన్ని చూడాలని ఎందరో మహిళలు తమను కోరారని జుమా మసీదు బోర్డు సభ్యుడు మౌలావీ సిరాజ్ ఉద్దీన్ తెలిపారు. వారి నుంచి వస్తున్న డిమాండ్ మేరకు రెండు రోజుల పాటు అనుమతించనున్నామని, ఆ సమయంలో పురుషులకు ప్రవేశం ఉండదని తెలిపారు. ఈరోజుతో పాటు, మే 8వ తేదీన మహిళలను మసీదులోకి వెళ్లనిస్తామని వివరించారు. కాగా, మసీదు బోర్డు తీసుకున్న నిర్ణయంపై ముస్లిం వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.