: పార్టీ ఫిరాయింపులకు నిరసనగా... రాష్ట్రవ్యాప్తంగా వైసీసీ నేతల కొవ్వొత్తుల ప్రదర్శన
తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతుండడంతో పార్టీ ఫిరాయింపులకు నిరసనగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం రాత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ‘సేవ్ డెమొక్రసీ’ పేరుతో కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించారు. విశాఖలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పార్టీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారని అన్నారు. శ్రీకాకుళంలో నిర్వహించిన సేవ్ డెమొక్రసీ కార్యక్రమంలో పార్టీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ ఉల్లంఘనలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. విజయవాడలోనూ వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ తీశారు. వైఎస్సార్ బొమ్మపై ఎమ్మెల్యేగా గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరడం అన్యాయంగా పేర్కొన్నారు. టీడీపీలోకి వెళ్లే ఎమ్మెల్యేలకు దమ్మూ, ధైర్యం ఉంటే తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో తలపడాలని సవాల్ విసిరారు.