: మట్టికరిచిన ముంబై ఇండియన్స్....ఢిల్లీ డేర్ డెవిల్స్ విజయం
ఢిల్లీ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు మట్టికరిచింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ జట్టు ఆదిలోనే డికాక్ (1) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ శ్రేయస్ అయ్యర్ (19) ఒకట్రెండు షాట్లతో మెరిసినప్పటికీ నిలదొక్కుకోలేకపోయాడు. అనంతరం వచ్చిన సంజు శాంసన్ (60) దూకుడుగా ఆడాడు. అతనికి డుమిని (49) చక్కగా సహకారమందించాడు. కరణ్ నాయర్ (5) మాత్రం విఫలమయ్యాడు. పవన్ నేగి (10) డుమినితో కలిసి నాటౌట్ గా నిలవడంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. అనంతరం 165 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ జట్టు 9 పరుగుల వద్ద పార్థివ్ పటేల్ (1) వికెట్ కోల్పోయింది. అనంతరం అంబటి రాయుడు (25)తో కలసి ఓపెనర్ రోహిత్ శర్మ (32) నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ సరిదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే, అమిత్ మిశ్రా వేసిన బంతికి రాయుడు పెవిలియన్ చేరాడు. తరువాత వచ్చిన కునాల్ పాండ్య (36) ధాటిగా ఆడాడు. సమన్వయ లోపంతో రనౌట్ గా వెనుదిరిగాడు. బట్లర్ (2) విఫలమయ్యాడు, ఆదుకుంటాడనుకున్న పొలార్డ్ (19) భారీ షాట్ కు యత్నించి అవుటయ్యాడు. హార్డిక్ పాండ్య (2) రనౌట్ గా వెనుదిరిగాడు. హర్భజన్ (0) విఫలమయ్యాడు. ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు పది పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ బౌలర్లలో అమిత్ మిశ్రా రెండు వికెట్లు తీయగా, జహీర్, మోరిస్ చెరోవికెట్ తీశారు. రనౌట్లు కొంపముంచడంతో చివరి వరకు క్రీజులో ఉన్న రోహిత్ శర్మ జట్టును గెలిపించలేకపోయాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా సంజు శాంసన్ నిలిచాడు.