: గేల్ 'బిగ్ బాష్' లీగ్ లో పాల్గొనేందుకు తొలగిన అడ్డంకులు


వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ బిగ్ బాష్ లీగ్ లో ఆడేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్ జేమ్స్ సదర్ లాండ్ తెలిపారు. గతేడాది బిగ్ బాష్ లీగ్ సందర్భంగా హోబార్ట్ హరికేన్స్-మెల్ బోర్న్ రెనగేడ్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా గేల్ ను టెన్ స్పోర్ట్స్ టీవీ ప్రజెంటర్ మెలానీ మెక్ లాఫిలిన్ ఇంటర్వ్యూ చేసింది. 'ఈ ఇన్నింగ్స్ లో మంచి స్కోరు చేయడం పట్ల ఎలా ఫీలవుతున్నార'ని ప్రశ్నించింది. 'నువ్వు ఇంటర్వ్యూ చేయాలనే బాగా ఆడాన'ని అన్నాడు. 'నీ కళ్లు చాలా బాగున్నాయి. మ్యాచ్ అయిపోగానే డ్రింక్స్ తీసుకునేందుకు వెళ్దాం' అన్నాడు. అతని వ్యాఖ్యలకు ఎలా స్పందించాలో అర్థం కాని మెలానీ 'నో' అనేలోపు మళ్లీ గేల్ అందుకుని 'సిగ్గుతో మరీ పొంగిపోకు బేబీ' అని అన్నాడు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. గేల్ వ్యాఖ్యలు లైంగిక వేధింపులతో సమానం అని పలువురు పేర్కొన్నారు. దీంతో వివాదం రాజుకుంటుందని భావించిన గేల్ వెంటనే క్షమాపణలు చెప్పాడు. తరువాత సీఏ విధించిన 10 వేల యూఎస్ డాలర్ల జరిమానా చెల్లించాడు. దీంతో ఇకపై గేల్ ను బిగ్ బాష్ లీగ్ ఆడకుండా నిషేధించాలని పలువురు డిమాండ్ చేశారు. వీటిపై క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది. లీగ్ లో ఏ ఆటగాడైనా అవినీతికి పాల్పడితేనే, అలాంటి వారిని తప్పించే అవకాశం ఉందని చెప్పింది. ఆటగాళ్ల నియామకం విషయంతో తమకు సంబంధం లేదని సీఏ తెలిపింది. గేల్ ను బిగ్ బాష్ లీగ్ నుంచి తప్పించడం తమ విధి కాదని సీఏ స్పష్టం చేసింది. దీంతో బిగ్ బాష్ లీగ్ లో గేల్ పాల్గొనేందుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగినట్టే.

  • Loading...

More Telugu News