: మరోసారి కుట్ర జరుగుతోంది: ఆర్మీపై ధిక్కారం ప్రకటించిన నవాజ్ షరీఫ్
మరోసారి తనను దించేసే కుట్ర జరుగుతోందని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ, తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతోందని అన్నారు. అల్లాకు, ప్రజలకు తప్ప మరెవరికీ తాను జవాబుదారీని కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆర్మీపై బహిరంగ ధిక్కారం ప్రకటించారు. తన కుటుంబ సభ్యులకు విదేశాల్లో ఆస్తులు ఉన్నాయన్న వార్తలపై విచారణకు సిద్ధమని ఆయన ప్రకటించారు. నవాజ్ షరీఫ్ అకస్మాత్తుగా ప్రజలనుద్దేశించి మాట్లాడడానికి కారణం ఏంటంటే...పనామా పేపర్స్ లో నవాజ్ షరీఫ్ పేరు బయటపడిన నాటి నుంచి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న ఆర్మీ చీఫ్ రహీల్ అవినీతిని సహించేది లేదని పేర్కొంటూ, అవినీతికి పాల్పడిన ఆరుగురు ఆర్మీ ఉన్నతాధికారులను విధుల నుంచి తొలగించారు. అవినీతిని కూకటివేళ్లతో పెకలించకపోతే ఉగ్రవాదం అంతం కాదని ఆయన పేర్కొన్నారు. దీంతో షరీఫ్ ను ఇరకాటంలో పెట్టేందుకు ఆయన ఈ చర్యలకు పాల్పడినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో గతంలో ఆర్మీ చీఫ్ గా వున్న ముషారఫ్ చేసిన కుట్ర దిశగా అడుగులు పడుతున్నాయని గ్రహించిన షరీఫ్, ప్రజలనుద్దేశించి మాట్లాడారు. గతంలో అధికారం వదులుకున్నంత ఈజీగా ఈసారి పదవి వీడే సమస్య లేదని ఆయన పరోక్షంగా ప్రకటించారు. పనిలో పనిగా ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు నవాజ్ సమాధానమిస్తూ, తనపై వచ్చిన ఆరోపణలను ఎవరైనా సాక్ష్యాధారాలతో నిరూపిస్తే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.