: స్మార్ట్‌ఫోన్‌తో పిల్లలకు మరో ప్రమాదం.. మెల్లకన్ను ముప్పు
స్మార్ట్ ఫోన్‌లు ఉపయోగిస్తే వచ్చే దుష్ఫలితాల జాబితాలో మరో అంశం చేరింది. గతంలో పిల్లలు అతిగా స్మార్ట్‌ఫోన్లు ఉపయోగిస్తే అతి పిన్న వయస్సులోనే మెదడులో చిన్న చిన్న కణితలు ఏర్పడే అవకాశాలున్నాయని హెచ్చరించిన పరిశోధకులు.. తాజాగా మరో ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. అతిగా స్మార్ట్‌ఫోన్ వాడే పిల్లల్లో మెల్లకన్ను వచ్చే ప్రమాదం ఉందని దక్షిణ కొరియాలోని చొన్నం నేషనల్ యూనివర్సిటీ ఆసుపత్రికి చెందిన పరిశోధకులు తెలిపారు. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌ను అదేపనిగా చూడడం వల్ల ఈ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఏడు నుంచి 16 ఏళ్ల వయసున్న పిల్లలపై ఈ పరిశోధన జరిపారు. దీనికోసం 12 మంది పిల్లలను ఎంపిక చేసుకొని అధ్యయనం జరిపారు. 20నుంచి 30 సెంటీమీటర్ల మధ్య స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌ను ఉంచి, ప్రతీ రోజు నాలుగు గంటలకు పైగా పిల్లలు స్మార్ట్‌ఫోన్ ఉపయోగించేలా చేసిన వైద్యులు.. వారిలో 9 మంది కళ్లల్లో వ్యత్యాసం కనిపించిందని పేర్కొన్నారు. పిల్లలు స్మార్ట్ ఫోన్‌ను అతిగా ఉపయోగించకుండా తల్లిదండ్రులు కట్టడి చేయాలని సూచించారు. స్మార్ట్ ఫోన్‌ను 30 నిమిషాల పాటు అదేపనిగా ఆపకుండా చూసినా ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు.