: ఇంటివాడైన షకలక శంకర్.. నిరాడంబరంగా పెళ్లి చేసుకున్న'జబర్దస్త్' స్టార్
'జబర్దస్త్' టీవీ కామెడీషోతో మంచి పేరుతెచ్చుకున్న హాస్యనటుడు షకలక శంకర్ ఓ ఇంటివాడయ్యాడు. ఎటువంటి ఆర్భాటాలు లేకుండా నిన్న రాత్రి శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ఆయన పెళ్లి చేసుకున్నాడు. అక్కడి ఒక ప్రైవేటు కల్యాణ మండపంలో తన మేనమామ కూతురు పార్వతి మెడలో మూడు ముళ్లు వేశాడు. తన తోటి నటులని సైతం ఆహ్వానించకుండా పెళ్లి చేసుకున్నట్లు షకలక శంకర్ చెప్పాడు. తన బంధువులు కొంత మంది సమక్షంలో మాత్రమే పెళ్లి వేడుక జరిగిందని చెప్పాడు. 'అరసవల్లిలోని సూర్యనారాయణ స్వామి సన్నిధిలో నా పెళ్లి జరిపిస్తానని నాన్న మొక్కుకున్నారు. అందుకే పెళ్లి వేదికగా అరసవల్లిలోని కల్యాణ మండపాన్ని ఎన్నుకున్నా'నని తెలిపారు. పెళ్లి ఆడంబరంగా చేసుకోవడం తనకు ఇష్టం లేదని, పెళ్లికి చేసే అనవసర ఖర్చు సేవాకార్యక్రమాలకి వినియోగించవచ్చని అన్నాడు. పేద పిల్లలకి పుస్తకాలు, క్రికెట్ కిట్లు, దుస్తులు కొనిస్తానని చెప్పాడు. పవన్ కల్యాణ్‌తో కలిసి సర్దార్ గబ్బర్ సింగ్‌లో నటించడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. తన చేతిలో ఇప్పుడు 15 సినిమాలు ఉన్నాయని తెలిపాడు.