: పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ: రాజ్ భవన్ వద్ద జగన్ ఆవేదన


ఏపీలో ప్రజాస్వామ్యం పట్టపగలే ఖూనీ అవుతోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో జోరుగా సాగుతున్న టీడీపీ ఆకర్ష్ కు అడ్డుకట్ట వేసే క్రమంలో ‘సేవ్ డెమొక్రసీ’ పేరిట సరికొత్త తరహాలో ఆందోళనలకు తెర తీసిన జగన్... కొద్దిసేపటి క్రితం తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి హైదరాబాదులోని రాజ్ భవన్ లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో భేటీ అయ్యారు. తన పార్టీ టికెట్ పై విజయం సాధించి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ తర్వాత బయటకు వచ్చిన జగన్ అక్కడే మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులను గవర్నర్ కు వివరించామని చెప్పారు. రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా జరుగుతోందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టులో ప్రభుత్వ పెద్దలు పెద్ద మొత్తంలో డబ్బులు దండుకున్నారని ఆరోపించారు. అమరావతిలో చంద్రబాబు బినామీల పేరిట పెద్ద మొత్తంలో భూములను కొనుగోలు చేశారన్నారు. ప్రభుత్వం కొంతమంది కాంట్రాక్టర్లకే లబ్ధి చేకూరుస్తోందన్నారు. ఇసుక మాఫియాను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ధ్వజమెత్తారు. తన పార్టీ టికెట్ పై విజయం సాధించిన ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.20 నుంచి 30 కోట్లిస్తూ టీడీపీలోకి లాక్కుంటున్నారని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News