: మీసాలు తీసేసి... కొత్త లుక్కులో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం
ముంబై మారణహోమానికి కీలక సూత్రధారిగా వ్యవహరించిన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం... ఆ తర్వాత పాకిస్థాన్ పారిపోయాడు. పాక్ వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన కరాచీ కేంద్రంగా అతడు కుటుంబంతో సహా నిశ్చింతగా ఉన్నాడు. ముంబై మారణహోమం తర్వాతైనా తన పద్ధతి మార్చుకోని దావూద్... పాక్ నే కేంద్రంగా చేసుకుని విశ్వవ్యాప్తంగా పలు దేశాల్లో తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అసలు అతడు ఎలా ఉంటాడు? ఈ ప్రశ్నకు మన దగ్గర ఒకేఒక్క సమాధానం ఉంది. చక్కటి మీసకట్టుతో కళ్లద్దాలు పెట్టుకుని చారల సూట్ తో చిద్విలాసంగా నవ్వుతున్న దావూద్ కుర్చీలో జారగిలబడి కూర్చున్న ఫొటో మన కళ్ల ముందు మెదలాడుతుంది. అయితే తాజాగా మీసకట్టు తీసేసి, మరింత అమాయకంగా కనిపిస్తున్న ఫొటో ఒకటి వెలుగులోకి వచ్చింది. దావూద్ ను ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్లిన ఓ మీడియా ప్రతినిధి ఈ ఫొటోను తీసినట్లు ప్రచారం సాగుతోంది. సదరు ఫొటో ప్రస్తుతం భారత నిఘా వర్గాల చేతికి చిక్కింది. అయితే ఈ ఫొటోలో ఉన్నది దావూదేనా? అన్న విషయం ఇంకా నిర్ధారణ కాలేదు.