: చంద్రబాబు, కేసీఆర్ ల మధ్య ఒప్పందం... తెలుగు రాష్ట్రాల మధ్య అనుబంధం: తుమ్మల
టీఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలోని షిరిడీ సాయి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జిల్లాలోని లింగపాలెం మండలం మఠంగూడెంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లిన తుమ్మల మార్గమధ్యంలో షిరిడి ఆలయంలో పూజలు చేశారు. ఆ తర్వాత మఠంగూడెంలో ఆయన స్థానిక మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల మధ్య అనుబంధం ఏమాత్రం చెడలేదని పేర్కొన్నారు. ఒకే జాతి, ఒకే భాష, ఒకే సంస్కృతి ఉన్న ఏపీ, తెలంగాణలు రాజ్యాంగబద్ధంగా విడిపోయినా.... వాటి మధ్య అనుబంధం మాత్రం చెడలేదన్నారు. నైసర్గికంగా తెలంగాణ పైభాగాన ఉండగా, ఏపీ కింది భాగాన ఉందని తుమ్మల పేర్కొన్నారు. విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు పుట్టుకొస్తుంటాయన్న ఆయన... ఏపీ, తెలంగాణ విషయాల్లో మాత్రం అలా జరగలేదన్నారు. తెలంగాణలో ఎన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టినా... దుమ్ముగూడెం వరకు మాత్రమే తాము గోదావరి నీటిని వాడుకునే అవకాశం ఉందన్నారు. ఏదేమైనా, రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించుకునేందుకు ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ సహకరించుకుంటామని ఒప్పందం చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు.