: రాంరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు పోటీ చేస్తే మేము బరిలోకి దిగం: వైఎస్సార్సీపీ నేత పొంగులేటి


ఖమ్మం జిల్లాలోని పాలేరులో దివంగత సిట్టింగ్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు కనుక పోటీ చేస్తే తమ పార్టీ నుంచి పోటీ పెట్టమని తెలంగాణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క ఈ రోజు కలిశారు. అనంతరం పొంగులేటి విలేకరులతో మాట్లాడుతూ, పాలేరు ఉప ఎన్నికలో భాగంగా కాంగ్రెస్ నేత తమ మద్దతును కోరారని తెలిపారు. ఎవరైనా ఎమ్మెల్యే మరణించిన అనంతరం నిర్వహించే ఉపఎన్నికలో ఆయన కుటుంబసభ్యులెవరైనా పోటీ చేసిన సందర్భాలలో తమ పార్టీ నుంచి అభ్యర్థులను నిలబెట్టలేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మిగిలిన పార్టీలు కూడా ఇదే పద్ధతిని పాటించాలని పొంగులేటి కోరారు. కాగా, పాలేరు ఉప ఎన్నికలో రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితను బరిలోకి దింపాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది.

  • Loading...

More Telugu News