: గయ రైల్వేస్టేషన్ ను పేల్చేస్తాం: అధికారులకు నక్సలైట్ల బెదిరింపు లేఖ
ప్రయాణికులతో ఎల్లప్పుడూ రద్దీగా కనిపించే బీహార్‌లోని గయ రైల్వే స్టేషన్‌ను పేల్చేస్తామంటూ అధికారులకు నక్సలైట్లు బెదిరింపు లేఖను పంపినట్లు తెలుస్తోంది. ఈ బెదిరింపుల నేపథ్యంలో గయ రైల్వే స్టేషన్‌లో భద్రతా బలగాలు కాపు కాస్తున్నాయి. ఎటువంటి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. గయ నక్సల్ ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసులు బెదిరింపు అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. రైల్వే స్టేషన్‌ను పేల్చేస్తామంటూ వచ్చిన లేఖ ఆధారంగా విచారణను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.