: టీసీఎస్ తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం చేసుకున్న విస్తారా
తమకు అవసరమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవలను అందుకునేందుకు ఫుల్ సర్వీస్ ఎయిర్ లైన్ 'విస్తారా', టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఎయిర్ పోర్టుల్లో మౌలిక వసతులకు సంబంధించిన సాంకేతిక మద్దతుతో పాటు అప్లికేషన్ నిర్వహణా సేవలను, నెట్ వర్క్ నిర్వహణ, ప్రయాణికుల వివరాల కంప్యూటింగ్ తదితర సేవలను టీసీఎస్ అందించనుందని, ఇది దీర్ఘకాలం పాటు సాగే ఒప్పందమని విస్తారా నేడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. తాము లక్ష్యాన్ని సాధించే దిశగా టీసీఎస్ సహకారం అత్యంత ముఖ్యమని వ్యాఖ్యానించింది. కస్టమర్లకు మరింత ఆహ్లాదకర అనుభూతి, నిర్వహణలో మరింత క్వాలిటీని టీసీఎస్ సహకారంతో అందించగలమని తెలిపింది. కాగా, విస్తారా సంస్థ టాటా సన్స్, సింగపూర్ ఎయిర్ లైన్స్ జాయింట్ వెంచర్ గా ఉన్న సంగతి తెలిసిందే.