: కోటీశ్వరుడు అయి ఉండి కూడా... రాజ్యసభ నుంచి రూ. 20 వేల నెల సాయాన్నీ అందుకున్న మాల్యా!
విజయ్ మాల్యా... కోట్లకు పడగలెత్తిన వ్యాపారవేత్త. రాజ్యసభలో ఎంపీ కూడా. ఇక రాజ్యసభ సభ్యులకు కేంద్రం కల్పించే ఏ సౌకర్యాన్నీ ఆయన వదులుకోలేదట. టెలిఫోన్ ఖర్చులు, నియోజకవర్గ అలవెన్సులు, ఆఫీసు ఖర్చులు ఇలా నెలకు రావాల్సిన ప్రతి ఒక్క రూపాయినీ వదలకుండా తీసుకున్నారని, సమాచార హక్కు చట్టం ఉపయోగించి మహమ్మద్ ఖాలిద్ జిలానీ అనే స.హ కార్యకర్త, రాజ్యసభ కార్యదర్శి నుంచి సమాచారం రాబట్టాడు. బ్యాంకులకు రూ. 9 వేల కోట్ల బకాయి ఉన్న మాల్యా, రాజ్యసభ సభ్యుడిగా ప్రతి నెలా వచ్చే రూ. 50 వేలను టంచనుగా తీసుకునేవారట. ఆపై నియోజకవర్గ అలవెన్సుగా ఇచ్చే రూ. 20 వేలు, ఆఫీసు నిర్వహణా ఖర్చు కింద నెలకు రూ. 6 వేలు కూడా తీసుకునేవారట. ప్రతి నెలా 50 వేల లోకల్ కాల్స్ ను ఉచితంగా వాడుకునే సదుపాయం ఉండగా, ఏకంగా రూ. 1.73 లక్షల బిల్లు ఆయన ఫోన్ కాల్స్ పై వచ్చిందట. 2002 నుంచి ఆయన పార్లమెంటులో స్వతంత్ర సభ్యుడిగా ఉండగా, కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఆయనకు మద్దతునిచ్చిన సంగతి తెలిసిందే.