: సినిమా ఫక్కీలో జరిగిన పెళ్లిది... పరిగెత్తుతూ వెళ్లి తాళికట్టి ముద్దాడిన వరుడు!
తిరుమలలో ఈ ఉదయం ఓ పెళ్లి మాస్ మసాలా సినిమా ఫక్కీలో జరిగింది. వివరాల్లోకి వెళితే, నెల్లూరు జిల్లా డక్కిలికి చెందిన జనార్దన్, సుమలతల వివాహాన్ని నిశ్చయించిన పెద్దలు తిరుమలలో పెళ్లి జరిపించేందుకు వచ్చారు. అయితే, గతంలో జనార్దన్ తనను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడని, తామిద్దరం ప్రేమించుకున్నామని, ఆపై తనను మోసం చేశాడని పద్మ అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తిరుమలకు వచ్చి పెళ్లిని అడ్డుకున్నారు. జనార్దన్ ను అరెస్ట్ చేసి కారులో తరలించేందుకు ప్రయత్నించగా, సుమలత తరఫు బంధువులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఈలోగా కారు డోర్ తీసుకుని పరుగులు పెడుతూ జనార్దన్ కల్యాణ మండపం చేరుకుని వధువు సుమలత మెడలో మూడు ముళ్లు వేసి దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టాడు. తనకు పద్మతో ఎలాంటి సంబంధం లేదని, ఆధారాలు లేకుండా ఎలా వస్తారని జనార్దన్ ప్రశ్నించగా, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, విచారణను కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.