: రుణాన్ని తిరిగి చెల్లిస్తానంటే పట్టించుకోని ఎస్బీహెచ్... బట్టలిప్పి నిరసన తెలిపిన వ్యాపారి
బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని ఎగ్గొడుతున్న వ్యాపారవేత్తల సంఖ్య నానాటికీ పెరుగుతున్న వేళ, తీసుకున్న అప్పును తిరిగి చెల్లిస్తానని వచ్చిన వ్యక్తికి చుక్కలు చూపుతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ నిర్వాకమిది. బ్యాంకు అధికారుల వైఖరిని నిరసిస్తూ, సదరు వ్యాపారి బట్టలు విప్పి అర్ధనగ్న ప్రదర్శన చేశాడు. ఈ ఉదయం అబిడ్స్ లోని గన్ ఫౌండ్రీ ఎస్బీహెచ్ ప్రధాన కార్యాలయం వద్ద ఈ ఘటన జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే... బాసరకు చెందిన ప్రకాష్ అనే వ్యాపారి ఓ హోటల్ ను నిర్వహిస్తూ, తన ఆస్తిని నిజామాబాద్ బ్యాంకు శాఖలో తనఖా పెట్టాడు. ఆపై కొంతకాలానికి డబ్బు తిరిగి చెల్లిస్తానని చెబుతూ, బ్యాంకు అధికారులను సంప్రదించగా, వారు పట్టించుకోవడం లేదట. పలుమార్లు వారిని సంప్రదించినా ఫలితం లేకపోవడంతో, గన్ ఫౌండ్రీ హెడ్డాఫీస్ వద్దకు వచ్చి పై అధికారులను కలిసేందుకు ప్రయత్నించగా సిబ్బంది అనుమతించ లేదు. దీంతో ఆయన అర్ధనగ్నంగా నిలిచి నిరసన తెలపడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో అక్కడికి వచ్చిన పోలీసులు ప్రకాష్ కు సర్దిచెప్పి రీజనల్ ఆఫీసర్ అపాయింట్ మెంట్ ఇప్పించడంతో సమస్య సద్దుమణిగింది.