: విదేశీయుల చూపు మనవైపే... చైనా, అమెరికాలను దాటేసిన ఇండియా!
నరేంద్ర మోదీ మానస పుత్రికగా ప్రారంభమైన 'మేకిన్ ఇండియా' ప్రచారం ఫలాలు కనిపించడం మొదలైంది. ఇండియాకు వచ్చి పెట్టుబడులను పెట్టే కంపెనీలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు, అనుమతులను సత్వరమే అందించేందుకు నిర్ణయించి, ప్రత్యేక ఏర్పాట్లు చేసిన వేళ, భారీ ఎత్తున ఇన్వెస్ట్ మెంట్ దేశానికి వచ్చింది. 2015లో చైనా, అమెరికాలకు వచ్చిన విదేశీ నిధుల కంటే, ఇండియాకు అధిక నిధులు వచ్చాయని 'ఎఫ్డీఐ ఇంటెలిజెన్స్' తన తాజా రిపోర్టులో వెల్లడించింది. చేపట్టిన ప్రాజెక్టుల సంఖ్యలో సైతం 8 శాతం పెరుగుదల నమోదైందని, మొత్తం 697 ప్రాజెక్టుల్లో 63 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 4.20 లక్షల కోట్లు) పెట్టుబడిగా వచ్చిందని తెలిపింది. ఇండియాలో ఇన్వెస్ట్ మెంట్ చేసిన ప్రముఖ కంపెనీల్లో ఫాక్స్ కాన్ (5 బిలియన్ డాలర్లు - సుమారు రూ. 33,500 కోట్లు), సన్ ఎడిసన్ (4 బిలియన్ డాలర్లు - సుమారు రూ. 26, 665 కోట్లు) తదితర కంపెనీలు ఉన్నాయి. వీటితో పాటు బొగ్గు గనుల్లో, చమురు, సహజవాయు క్షేత్రాల్లో అధికంగా పెట్టుబడులు వచ్చాయని నివేదిక వెల్లడించింది. గత సంవత్సరం చైనాకు 56.6 బిలియన్ డాలర్ల పెట్టుబడి రాగా, అమెరికాకు 59.6 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపింది. ఇదే విషయాన్ని ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా తన సామాజిక మాధ్యమ ఖాతా ట్విట్టర్ ద్వారా తెలిపారు. "ప్రపంచంలోనే అత్యధిక ఎఫ్డీఐని ఆకర్షించిన దేశంగా ఇండియా నిలిచింది" అని ఆయన తెలిపారు. ఇక ఇండియాకు వచ్చిన పెట్టుబడుల్లో అత్యధికంగా 12.4 బిలియన్ డాలర్లు గుజరాత్ కు వెళ్లగా, రెండో స్థానంలో మహారాష్ట్ర నిలిచి 8.3 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్ మెంట్ ను ఆకర్షించింది.