: చంద్రబాబు స్వయంగా ఇచ్చిన లేఖనే కాదు పొమ్మన్న వేళ... ఓ దీన కుటుంబం కన్నీటి గాధ!
స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నుంచి లేఖ వచ్చినా, ఆసుపత్రి అధికారులు కాదు పొమ్మంటే, ఏమీ చేయలేని దిక్కు తోచని స్థితిలో సత్రంలో రోజులు వెళ్లదీస్తున్న తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలుకు చెందిన దీన కుటుంబం గాధ ఇది. మరిన్ని విరాల్లోకి వెళితే, కూలి పని చేసుకుని కాలం వెళ్లదీస్తున్న బొర్రా లక్ష్మీనారాయణకు వెన్ను నొప్పి రావడంతో 1995లో విశాఖపట్నంలోని కేజీహెచ్ లో ఆపరేషన్ చేశారు. తరువాత కొంతకాలానికి సమస్య మళ్లీ రావడంతో 2008లో మరో శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ లోపాల కారణంగా తిరిగి 2013లో మంచం పట్టాడు. ఇంకోసారి ఆపరేషన్ చేయాల్సి వుందని, అందుకు రూ. 2.25 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తేల్చడంతో, అంత డబ్బు లేని ఆ పేద కుటుంబం ముఖ్యమంత్రి సహాయ నిధిని ఆశ్రయించింది. ఫిబ్రవరి 27న సహాయ నిధి నుంచి రూ. 85 వేలు మంజూరు చేస్తున్నట్టు లేఖ రాగా, ఆ మొత్తం సరిపోదని బాధితుడి కుమార్తె మరోసారి మొర పెట్టుకోవడంతో, మార్చి 4వ తేదీతో రూ. 2 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ఇంకో లేఖ వచ్చింది. దాన్ని తీసుకుని ఆసుపత్రికి వెళ్లగా, చెక్కు లేదా డబ్బు తేవాలని అక్కడి అధికారులు తేల్చి చెప్పడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆ కుటుంబం ఆసుపత్రి దగ్గర్లోనే సుబ్బరామిరెడ్డి నిర్మించిన ధర్మసత్రంలో కాలం గడుపుతోంది. తమను ఆదుకోవాలని వేడుకుంటోంది. వాస్తవానికి చెక్కులు ఇవ్వాల్సిన చోట, నిధుల లేమితో కేవలం లేఖలు మాత్రమే ఇస్తున్న కారణంగానే, డబ్బులు ఎప్పటికి వస్తాయోనన్న ఆలోచనతో ఆసుపత్రి వర్గాలు వాటిని నిరాకరిస్తున్నట్టు తెలుస్తోంది.