: ఎన్టీఆర్ వైద్య సేవలకు గండి!... ఏపీలో ఎల్లుండి నుంచి 150కి పైగా ఆసుపత్రుల్లో నిలిచిపోనున్న సేవలు
ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలకు ప్రమాదం పొంచి ఉంది. ఎల్లుండి నుంచి 150కి పైగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ సేవలు నిలిచిపోనున్నాయి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరిట ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ వైద్య సేవల పథకం ద్వారా పేదలకు ఉచితంగానే కార్పొరేట్ వైద్యం అందుతోంది. అయితే ప్రభుత్వ హామీతో పేదలకు ఉచితంగానే వైద్య సేవలందిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులకు కొంతకాలంగా బిల్లులు మంజూరు కావడం లేదు. ఈ బకాయిలు ప్రస్తుతం రూ.400 కోట్లకు చేరాయి. బిల్లుల మంజూరు కోసం ప్రైవేటు ఆసుపత్రుల వినతులకు ప్రభుత్వం స్పందించడం లేదట. దీంతో సమ్మె బాట పడితేనే బిల్లులు మంజూరవుతాయని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల సంఘం భావించింది. అనుకున్నదే తడవుగా సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ నేటి ఉదయం కీలక ప్రకటన జారీ చేశారు. తక్షణమే బిల్లులు చెల్లించాలని, లేని పక్షంలో ఎల్లుండి నుంచి 150కి పైగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేస్తామని ఆయన ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.