: ఒక్క ఫోన్ లోని సమాచారం కోసం రూ. 6.6 కోట్లు ఖర్చుపెట్టిన అమెరికా
అమెరికాలోని శాన్ బెర్నార్డినోపై దాడి చేసిన ఉగ్రవాది సయ్యద్ రిజ్వాన్ ఫరూక్ ఐఫోన్ ను అన్ లాక్ చేసి అందులోని సమాచారాన్ని తెలుసుకునేందుకు మిలియన్ డాలర్లకు (సుమారు 6.6 కోట్లు) పైగా ఖర్చు చేసినట్టు యూఎస్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ జేమ్స్ కామే వెల్లడించారు. ఇది ఓ హై ప్రొఫైల్ కేసు కాబట్టే అంతమొత్తం ఖర్చు పెట్టాల్సి వచ్చిందని ఆయన అన్నారు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న ఆయన ఆస్పెన్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేసిన ఓ సదస్సులో ప్రసంగించారు. ఈ ఫోన్ నుంచి ఉగ్రవాదులకు చెందిన ఎంతో సమాచారం లభిస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. గత సంవత్సరం డిసెంబర్ 2న ఉగ్రదాడి చేసిన రిజ్వాన్ 14 మందిని పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. తన దృష్టిలో ఆ ఫోన్ కు అంత పెద్ద మొత్తం డబ్బు ఖర్చు పెట్టి అన్ లాక్ చేయించడం సరైన నిర్ణయమేనని భావిస్తున్నట్టు కామే వెల్లడించారు. ఈ ఐఫోన్ ను అన్ లాక్ చేసింది ఎవరన్న విషయాన్ని ఎఫ్బీఐ అధికారికంగా వెల్లడించకపోయినా, ఇజ్రాయిల్ కు చెందిన ఓ టెక్ కంపెనీ సాయపడినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.