: బాలయ్య వందో సినిమా పండుగ!... క్లాప్ కొట్టనున్న కేసీఆర్!
టాలీవుడ్ అగ్ర నటుడు, అనంతపురం జిల్లా హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ షూటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ చిత్రం ప్రారంభోత్సవానికి హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో భారీ ఏర్పాట్లు జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు... ఇద్దరూ హాజరుకానున్నట్లు నిన్నటిదాకా ప్రచారం సాగింది. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఇటీవలే కేసీఆర్ ను బాలయ్య ఆహ్వానించారు. అంతకుముందే చంద్రబాబుకు కూడా బాలయ్య ఆహ్వానం అందింది. అయితే తాజా సమాచారం ప్రకారం... కొన్ని అనివార్య కారణాల వల్ల చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదు. కేసీఆర్ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. కేసీఆరే ఈ చిత్రానికి క్లాప్ కొట్టనున్నట్లు సమాచారం. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులతో పాటు టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.