: టీడీపీ ఎమ్మెల్యే అనిత కాళ్లు కడిగి రోజా క్షమాపణ చెప్పాలి!: బొండా ఉమా డిమాండ్
వైసీపీ మహిళా ఎమ్మెల్యే అర్కే రోజాపై విధించిన ఏడాది సస్పెన్షన్ కు సంబంధించి నిన్న సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ విషయంలో అటు అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజా తీరును తప్పుబట్టిన ధర్మాసనం... అందరినీ కలుపుకుని వెళ్లాలని టీడీపీ ప్రభుత్వానికి చురకలంటించింది. అంతేకాక ఏకవాక్య క్షమాపణ కోరుతూ స్పీకర్ కు లేఖ రాయాలని రోజాను ఆదేశించిన కోర్టు... సదరు లేఖను పరిగణనలోకి తీసుకుని వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా సభకు సూచించింది. ఈ క్రమంలో నేటి ఉదయం ఓ ప్రైవేట్ న్యూస్ చానెల్ తో మాట్లాడిన సందర్భంగా టీడీపీ కీలక నేత, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఓ ఆసక్తికర డిమాండ్ ను వినిపించారు. తమ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యే అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజా... అనిత కాళ్లను కడిగి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై పట్టు విడుపులతో వ్యవహరించాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేస్తే... అనిత కాళ్లు కడిగి రోజా క్షమాపణ చెప్పాలని బొండా ఉమా డిమాండ్ చేయడం గమనార్హం.