: మనిషిని కరిచిన కుక్క నురగలు కక్కుతూ చనిపోయింది!... కడప జిల్లాలో వింత ఘటన
కుక్క కరిస్తే మనిషికి ప్రమాదం కాని... మనిషిని కరిచిన కుక్క నోట్లో నుంచి నురగలు కక్కుతూ చనిపోతే?... అది వింతే కదా! ఇలాంటి వింత ఘటనే నిన్న కడప జిల్లా పుల్లంపేట మండలం అనంతంపల్లె పంచాయతీ పరిధిలోని చాపల దళితవాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే... గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడుతుండటంతో ఊరంతా అతడిపై పిచ్చోడిగా ముద్ర వేసింది. ఈ క్రమంలో నిన్న అతడు వీధిలో వెళుతుండగా... ఓ వీధి కుక్క తన పిల్లలను కాపాడుకునే క్రమంలో అతడిపైకి లంఘించింది. ఆ వ్యక్తిని కరిచి గాయపరిచింది. ఆ తర్వాత అతడు అక్కడి నుంచి వెళ్లిపోగా... అతడు వెళ్లిన పది నిమిషాలకే కుక్క నోట్లో నుంచి నురగలు రావడం మొదలైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ కుక్క గిలగిలా కొట్టుకుంటూ చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆ పిచ్చోడికి ఏదో భయంకరమైన వ్యాధి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అయినా కుక్క కరిస్తే మనిషికి ప్రమాదం కానీ, మనిషిని కరిచిన కుక్క చనిపోవడమేమిటని వారు చర్చించుకుంటున్నారు.