: ఆ మహిళలు తలలు నరికించుకున్నారు కానీ...ఐఎస్ఐఎస్ కి తలలు మాత్రం వంచలేదు!
ఇరాక్, సిరియాల్లో ఐఎస్ఐఎస్ స్వాధీనంలో ఉన్న పలు ప్రాంతాలను తిరిగి ఆక్రమించుకుంటున్న క్రమంలో ఈ తీవ్రవాద సంస్థ చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా 250 మంది యువతులను నిలబెట్టి నరికి చంపిన ఘటన వెలుగు చూసింది. ఇరాక్ లోని వివిధ ప్రాంతాల నుంచి పట్టుకొచ్చిన యువతులకు ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థ పెద్దలు ఓ ఫర్మానా విడుదల చేశారు. ఈ ఫర్మానా ప్రకారం...ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థ తరపున పోరాడుతున్న తీవ్రవాదులను తాత్కాలికంగా పెళ్లి చేసుకుని, సెక్స్ బానిసలుగా పని చేయాలి. అయితే, దీనిని ఆ యువతులు వ్యతిరేకించారు. ప్రాణం పోయినా అందుకు అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. దీంతో వారి కుటుంబ సభ్యుల సమక్షంలోనే వారిని తలలు నరికి చంపారని కుర్దిష్ డెమొక్రాటిక్ పార్టీ అధికార ప్రతినిధి సయద్ మముజి తెలిపారు. తమ పిల్లలను పంపేందుకు అంగీకరించని తల్లిదండ్రులను కూడా ఇదే రకంగా హతమార్చినట్టు ఆయన వెల్లడించారు. ఐఎస్ఐఎస్ అధీనంలో ఉన్న ప్రాంతాల్లో మహిళల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని ఆయన తెలిపారు.