: ఎత్తు కోసం సర్జరీ చేయించుకున్న యువకుడు డిశ్చార్జ్...బాధితుడి తండ్రి ఆందోళన
మూడంగుళాల ఎత్తుకోసం సర్జరీ చేయించుకుని నరకయాతన అనుభవిస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నిఖిల్ రెడ్డిని గ్లోబల్ ఆసుపత్రి నుంచి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. దీనిపై బాధితుడి తండ్రి ఆందోళన వ్యక్తం చేశారు. తన కుమారుడు ఇంకా కోలుకోలేదని, శస్త్ర చికిత్స జరిగి 15 రోజులైనా నడవలేకపోతున్నాడని ఆయన పేర్కొన్నారు. ప్రతి రోజూ వైద్యుడు వచ్చి పరీక్షిస్తానని లిఖితపూర్వక హామీ ఇస్తేనే డిశ్చార్జ్ కి అంగీకరిస్తానని ఆయన తెలిపారు. దీంతో అతని షరుతుకు అంగీకరిస్తూ డాక్టర్ చంద్రభూషన్ హామీ పత్రం ఇచ్చారు. తల్లిదండ్రులకు చెప్పకుండా శస్త్ర చికిత్స చేయడం వివాదాస్పదం కావడంతో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నోటీసులు జారీ చేసింది. దీంతో ఎంసీఐ ఎథిక్స్ కమిటీ ముందు విచారణకు డాక్టర్ చంద్రభూషణ్ హాజరై వివరణ ఇచ్చారు. అతని వివరణ, బాధితుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదును ఎథిక్స్ కమిటీ రికార్డు చేసుకుంది. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా తమ కుమారుడికి ఎత్తు పెంచే ప్రయోగం చేశారని, ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని బాధితుడి తండ్రి పేర్కొన్నారు. దీంతో గ్లోబల్ ఆసుపత్రిపై వినియోగదారుల ఫోరం, హెచ్ఆర్సీలలో ఫిర్యాదు చేయనున్నామని ఆయన అన్నారు. ఇప్పటికే ఎంసీఐకి ఫిర్యాదు చేయడం, వారు వాంగ్మూలం నమోదు చేయడం జరిగిందని ఆయన చెప్పారు.