: పనామా పత్రాల సెగపై స్పందించిన అమితాబ్
నల్ల కుబేరుల గుట్టు బయటపెట్టిన పనామా పత్రాల జాబితాలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ పేరు కూడా ఉన్న సంగతి తెలిసిందే. పనామా పత్రాల సెగ తనను వెంటాడుతోన్న నేపథ్యంలో బిగ్ బీ తాజాగా స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానమిస్తూ... పనామా పత్రాల్లో తన పేరు అంశంపై పది రోజుల క్రితమే తనకు నోటీసులు అందాయన్నారు. ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నారు. ఈ విషయమై ఇప్పటికే తనను ప్రభుత్వం పలు ప్రశ్నలు అడిగిందని, తనను అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని చెప్పారు. తననుంచి మరింత సమాచారాన్ని ఆశిస్తే తప్పకుండా ప్రభుత్వానికి సహకరిస్తానని పేర్కొన్నారు. పలు కంపెనీల్లో తాను ఎన్నడూ డైరెక్టర్ గా పనిచేయలేదని చెప్పుకొచ్చిన అమితాబ్ వ్యాఖ్యలన్నీ అబద్ధాలంటూ ఓ ఆంగ్ల పత్రిక అమితాబ్‌పై కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే.