: రోజా సస్పెన్షన్ పై సుప్రీంలో సుదీర్ఘ వాదనలు!... రెండున్నర గంటల పాటు వాదించిన రోజా లాయర్
వైసీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు కొనసాగుతున్నాయి. నేటి ఉదయం కోర్టు ప్రొసీడింగ్స్ ప్రారంభమైన వెంటనే సుప్రీం ధర్మాసనం... తన సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ రోజా దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను ప్రారంభించింది. రోజా తరఫున గతంలో ఆమె పక్షాన వాదనలు వినిపించిన ప్రముఖ మహిళా న్యాయవాది ఇందిరా జైసింగే... ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన క్లెయింట్ పై ఏపీ శాసనసభ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిందని, సహజ న్యాయసూత్రాలకు సభ నిర్ణయం విరుద్ధమేనని జైసింగ్ వాదించారు. దాదాపు రెండున్నర గంటల పాటు జైసింగ్ గుక్క తిప్పుకోకుండా తన వాదనలు వినిపించారు. ఆమె వినిపించిన వాదనలను సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఆసక్తిగా ఆలకించింది. లంచ్ సమయం సమీపించిన నేపథ్యంలో విచారణను వాయిదా వేసిన ధర్మాసనం... మధ్యాహ్న భోజనం తర్వాత కూడా ఈ కేసుపైనే వాదనలు విననున్నట్లు ప్రకటించింది. సుదీర్ఘ వాదనల నేపథ్యంలో రోజా పిటిషన్ పై జరుగుతున్న విచారణపై ఆసక్తి నెలకొంది.