: కొంతకాలం ఆగండి: ఇండియాలోని సభ్యులకు ఐఎస్ఐఎస్ ఉగ్ర పెద్దల సలహా!
ఇండియాలోని ఎన్ఐఏ దూకుడుగా దాడులు జరుపుతున్న వేళ, దేశంలోని ఉగ్రవాదులు కొంతకాలం పాటు చడీచప్పుడు లేకుండా ఉండాలని సిరియా కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ సీనియర్లు సలహా ఇస్తున్నారు. ముంబై కేంద్రంగా టెక్నాలజీ నిపుణుడు ముదబ్బీర్ ముస్తాక్ షేక్ అరెస్టు తరువాత, దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు పట్టుబడుతుండటంతో, ఈ సలహాలు సిరియా నుంచి వచ్చాయని తెలుస్తోంది. ఐఎస్ఐఎస్ లో నియామకాలు జరిపే సీనియర్, షఫీ అమర్ అలియాస్ యూసఫ్ అల్ హిండీ నుంచి ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల ద్వారా ఈ సూచనలు వచ్చాయని, ఆన్ లైన్ సంప్రదింపులను కూడా కొంతకాలం నిలిపివేయాలని ఆయన చెప్పినట్టు సమాచారం. ఈ విషయాన్ని ఓ ఇంటెలిజెన్స్ అధికారి స్పష్టం చేశారు. "విదేశాల్లోని ఐఎస్ఐఎస్ వర్గాలు, ఇండియాలో నియమించుకున్న వారికి జాగ్రత్తలు చెప్పాయి. ఉగ్రవాదులను, వారి సానుభూతిపరులనూ జాగ్రత్తగా ఉండమని హెచ్చరికలు అందాయి" అని ఆయన అన్నారు. సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్ పై గట్టి నిఘా పెట్టిన భారత ఏజన్సీలు ఉగ్ర కదలికలను, వారి సంభాషణలను ఎప్పటికప్పుడు కనిపెడుతూ, వారి ఆటలను కట్టిస్తున్న సంగతి తెలిసిందే. గత సంవత్సరం మేలో మధ్యప్రదేశ్ లోని రాట్లాం ప్రాంతంలో ఐదుగురు సభ్యుల ఐఎస్ఐఎస్ మాడ్యూల్ ను, ఆపై ఈ సంవత్సరం జనవరిలో ఉత్తరాఖండ్ లో మకాం వేసిన నలుగురు సభ్యుల మాడ్యూల్ ను ఎన్ఐఏ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే.