: పెళ్లయిన కూతురికి తండ్రి ఆస్తులు ఇవ్వచ్చు: మైలురాయి వంటి తీర్పిచ్చిన సుప్రీంకోర్టు


పెళ్లయిన తన కుమార్తెకు తన ఇంటిని లేదా ఆస్తిని రాసిచ్చే హక్కులు తండ్రికి ఉంటాయని, ఈ విషయంలో భార్య, కుమారుడికి అడిగే హక్కు లేదని సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, వెస్ట్ బెంగాల్ కో-ఆపరేటివ్ సొసైటీల నిబంధనల ప్రకారం, ఓ ఫ్లాట్ యజమాని తన కుటుంబానికి చెందిన వారికి మాత్రమే ఆస్తులను రాసివ్వాల్సి వుంటుంది. ఇక విశ్వరాజన్ సేన్ గుప్తా అనే వ్యక్తి, తన చివరి రోజుల్లో భార్యా, కుమారుడి నుంచి నిరాదరణకు గురై కూతురు ఇంద్రాణి వద్ద కాలం గడిపి అక్కడే కనుమూశాడు. మరణించే ముందు తన ఆస్తిగా ఉన్న పూర్వాంచల్ హౌసింగ్ ఎస్టేట్ లోని ఫ్లాట్ ను ఆమె పేరున రిజిస్టర్ చేశారు. ఈ ఫ్లాట్ ను 1983 నాటి సొసైటీల చట్టం నిబంధనల ప్రకారం తమ పేరిట రిజిస్టర్ చేయాలని గుప్తా భార్య, కుమారుడు కోరగా, అందుకు హౌసింగ్ ఎస్టేట్ నిరాకరించింది. దీన్ని సవాలు చేస్తూ, వారు హైకోర్టును ఆశ్రయించగా, తొలుత ఏక సభ్య ధర్మాసనం, ఫ్లాట్ ను భార్య పేరున మార్చాలని తీర్పిచ్చింది. ఆపై డివిజన్ బెంచ్ కేసును విచారించి, ఆస్తిపై భార్యా, కుమారుడితో పాటు కుమార్తెకు కూడా హక్కుందని తీర్పిచ్చింది. తనకు తండ్రి రాసిచ్చిన ఆస్తిని, చివరి రోజుల్లో ఆయన్ను పట్టించుకోని తల్లి, సోదరులకు వాటా ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తూ, ఇంద్రాణి సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కేసును విచారించిన జస్టిస్ జేఎస్ ఖేకర్, జస్టిస్ సీ నాగప్పన్ లతో కూడిన ధర్మాసనం, ఇంద్రాణికి అనుకూలంగా తీర్పిచ్చింది. కో-ఆపరేటివ్ సొసైటీల సభ్యులైనా, తమకు నచ్చిన వారిని నామినీలుగా పెట్టుకోవచ్చని తెలిపింది. వివాహమైన కూతురికి ఆస్తిని రాసిచ్చే హక్కు తండ్రికి ఉందని తెలిపింది.

  • Loading...

More Telugu News