: తుమ్మల వర్సెస్ నామా?... పాలేరులో బిగ్ ఫైట్ కు టీడీపీ సన్నాహాలు!
తెలంగాణ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి హఠాన్మరణంతో ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో ఆసక్తికర పోరు జరగనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ స్థానాన్ని రాంరెడ్డి కుటుంబ సభ్యులకు ఏకగ్రీవంగా ఇచ్చేందుకు ససేమిరా అన్న అధికార టీఆర్ఎస్... తన అభ్యర్థిగా ఖమ్మం జిల్లాకు చెందిన కీలక రాజకీయ నేత, తెలంగాణ ఆర్ అండ్ బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ప్రకటించింది. ఆదిలో కమ్యూనిస్టులకు, ఆ తర్వాత టీడీపీకి కంచుకోటగా ఉన్న ఖమ్మం జిల్లాను తనకు పెట్టని కోటగా మార్చుకునే క్రమంలోనే ఆ పార్టీ... ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న తుమ్మలను పాలేరు బరిలోకి దింపిందన్న విశ్లేషణ సాగుతోంది. అయితే తనకు మంచి పట్టున్న ఖమ్మం జిల్లాలో సత్తా చాటేందుకు టీ టీడీపీ కూడా కాస్తంత లేటుగానే అయినా, సర్వశక్తులు ఒడ్డేందుకు కార్యరంగాన్ని సిద్ధం చేసుకుంటోంది. ఖమ్మం మాజీ ఎంపీ, పార్టీ సీనియర్ నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త నామా నాగేశ్వరరావును బరిలోకి దించే దిశగా అడుగులు వేస్తోంది. గతంలో తుమ్మల, నామా... ఇద్దరూ టీడీపీలోనే ఉన్నారు. తుమ్మల ఎమ్మెల్యేగా ఉండగా, నామా ఎంపీగా ఉన్నారు. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో వీరిద్దరూ ఓటమిపాలయ్యారు. అయితే జనంలో మంచి పట్టున్న తుమ్మల ఓటమికి నామా నాగేశ్వరరావు తెరవెనుక యత్నాలు చేశారన్న ఆరోపణలు నాడు గుప్పుమన్నాయి. ఆధిపత్య పోరులో భాగంగానే నాడు నామా... ఖమ్మం అసెంబ్లీ నుంచి బరిలోకి దిగిన తుమ్మలను ఓడించారన్న వాదన ఉంది. అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో జరిగిన తొలి ఎన్నికలు కావడంతో ఖమ్మం పార్లమెంటు నుంచి బరిలోకి దిగిన నామా... వైసీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతిలో మట్టి కరిచారు. నాడు ఎన్నికల్లో ఓటమితో అటు నామాతో పాటు ఇటు తుమ్మల కూడా చాలాకాలం పాటు రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. అయితే టీఆర్ఎస్ లో చేరిన తుమ్మల యాక్టివేట్ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే కూడా ఆయనకు తెలంగాణ సర్కారులో అధిక ప్రాధాన్యమే దక్కింది. అయితే ఓటమి తర్వాత పూర్తిగా వ్యాపారంలోనే తలమునకలైన నామా... రాజకీయాలను దాదాపుగా విడనాడినట్టే వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా పాలేరు బరిలోకి దిగాల్సిందేనని నామాను ఆయన అనుచరులు కోరుతున్నారు. పార్టీ అధిష్ఠానం కూడా కార్యకర్తల వాదనకు విలువిచ్చి నామాను బరిలోకి దింపేందుకు సిద్ధంగానే ఉంది. ఈ క్రమంలో తుమ్మలతో పోటికి నామా సై అంటారో, నై అంటారో అన్న విషయంపై ఆసక్తికర చర్చకు తెర లేసింది.