: లాటరీ ‘లక్కు’ తలుపు తడితే... ఎన్నికలు జరిగిన ఐదేళ్లకు ఎమ్మెల్సీ అయిన కాంగ్రెస్ నేత!
ఎప్పుడో ఐదేళ్ల క్రితం ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. సింగిల్ ఓటు తేడాతో ఓటమి... ఆయనను పోరు బాట పట్టించింది. సుదీర్ఘ కాలం పట్టువదలని విక్రమార్కుడిలా ఆయన న్యాయ పోరాటం సాగించారు. ఎట్టకేలకు ఐదేళ్ల తర్వాత నిన్న ఆయనకు లాటరీ ‘లక్కు’లా తగిలింది. ఇంకేముంది, ఎన్నికలు జరిగిన ఐదేళ్లకు ఆయన ఎమ్మెల్సీగా గెలుపొందారు. అయితే ఏడాది పాటు మాత్రమే ఆయన ఆ పదవిలో ఉంటారు. వింతల్లోకే వింతగా చెప్పుకుంటున్న ఈ ఘటన నిన్న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో చోటుచేసుకుంది. ఇక ఈ ఘటనకు చిత్తూరు జిల్లా వేదికైంది. వివరాల్లోకెళితే... 2011 మార్చి 21న తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నరేశ్ కుమార్ రెడ్డి బరిలో నిలిచారు. ఇక అప్పుడప్పుడే పురుడుపోసుకున్న వైసీపీ అభ్యర్థిగా ప్రస్తుతం చిత్తూరు జిల్లా మదనపల్లె వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న దేశాయి తిప్పారెడ్డి పోటీ చేశారు. టీడీపీ, స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో నిలిచిన ఈ ఎన్నికల్లో నాడు వైసీపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ జరిగింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా నాడు అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాడు సీఎం హోదాలో ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి... తన సొంత జిల్లాలో ఎలాగైనా నరేశ్ కుమార్ రెడ్డిని గెలిపించుకునేందుకు చేయని యత్నం లేదు. ఈ క్రమంలో పలు నాటకీయ పరిణామాల్లో నరేశ్ కుమార్ రెడ్డిపై దేశాయి తిప్పారెడ్డి సింగిల్ ఓటుతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని నరేశ్ కుమార్ రెడ్ది హైకోర్టును ఆశ్రయించారు. తనతో పాటు దేశాయి తిప్పారెడ్డికి సమంగా 408 ఓట్లు వచ్చాయని ఆయన కోర్టుకు తెలిపారు. ఈ కేసు విచారణ సుదీర్ఘకాలంగా సాగింది. ఈ క్రమంలో తెలుగు నేల రెండు రాష్ట్రాలు విడిపోవడం, ఇరు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు కూడా జరిగిపోయింది. అయితే నరేశ్ కుమార్ రెడ్డి మాత్రం తన పోరు ఆపలేదు. ఇదే సమయంలో నరేశ్ కుమార్ రెడ్డిపై విజయం సాధించిన ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి... 2014 ఎన్నికల్లో మదనపల్లె నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తిప్పారెడ్డి రాజీనామాను నిన్నటిదాకా ఏ ఒక్కరూ పరిగణనలోకి తీసుకున్న దాఖలా కనిపించలేదు. నిన్నటి విచారణలో భాగంగా కోర్టు కూడా తిప్పారెడ్డి రాజీనామాను ప్రస్తావించకుండానే... సమాన ఓట్లు వచ్చాయన్న నరేశ్ కుమార్ రెడ్డి వాదనతో ఏకీభవించింది. సమాన ఓట్లు వచ్చిన సందర్భంగా లాటరీ తీయాలన్న సంప్రదాయాన్ని గౌరవించిన కోర్టు... లాటరీ తీసింది. ఈ లాటరీలో నరేశ్ కుమార్ రెడ్డికి ‘లక్కు’ తగిలింది. దీంతో ఆయనను చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్సీగా కోర్టు ప్రకటించింది. అయితే ఎన్నికలు ముగిసి ఐదేళ్లు పూర్తి కాగా, మిగిలి ఉన్న ఏడాది కాలం వరకే నరేశ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు.