: పాలేరు బరిలో తుమ్మల!... టీఆర్ఎస్ అభ్యర్థిగా ఖరారు!
తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోమారు ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం శాసనమండలి సభ్యుడి(ఎమ్మెల్సీ)గా ఉన్న తుమ్మల కేసీఆర్ కేబినెట్ లో కీలక మంత్రిగా కొనసాగుతున్నారు. గడచిన ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన తుమ్మల... అనూహ్య పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ చేతిలో పరాజయం చవిచూశారు. సొంత పార్టీ నేతలే ఆయనను ఉద్దేశపూర్వకంగా ఓడించారన్న ప్రచారం నాడు సాగింది. ఈ క్రమంలో రాజకీయాలకు కాస్తంత దూరంగా జరిగిన తుమ్మల... తదనంతర పరిణామాల్లో టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరిపోయారు. మచ్చ లేని నేతగా ఎదిగిన తుమ్మలకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంచి ప్రాధాన్యమే ఇచ్చారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకున్నా... రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా పదవిని కట్టబెట్టారు. ఆ తర్వాత మండలికి ఆయనను నామినేట్ చేశారు. తాజాగా మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి హఠాన్మరణంతో ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. చనిపోయిన నేత కుటుంబానికే ఆ స్థానాన్ని ఏకగ్రీవంగా ఇచ్చేయాలన్న సంప్రదాయానికి మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నికలోనే తిలోదకాలిచ్చిన టీఆర్ఎస్... పాలేరు బరిలోనూ దిగేందుకు నిర్ణయించింది. ఈ క్రమంలో తన అభ్యర్థిగా తుమ్మల పేరును ఖరారు చేసింది. ఈ మేరకు నిన్న కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాలేరు బరిలో తుమ్మలను అభ్యర్థిగా దించుతున్నట్లు ప్రకటించిన కేసీఆర్...ఎన్నికల ఇన్ చార్జీగా తన కుమారుడు, ‘గ్రేటర్’ విజయ సారథి కేటీఆర్ ను నియమించారు.