: యూపీలో అన్ని అల్లర్లు జరిగినప్పటికీ ములాయం ‘మెస్సయ్య’ ఎలా అవుతారు?: ఆర్ యూసీ చైర్మన్
గుజరాత్ రాష్ట్రంలో అల్లర్ల అనంతరం ముస్లింలకు నరేంద్ర మోదీ శత్రువు అయ్యారని... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీ పాలనలో ఎన్ని అల్లర్లు జరిగినప్పటికీ ములాయం సింగ్ యాదవ్ మాత్రం ‘మెస్సయ్య’ (రక్షకుడు) గానే ఎలా ఉన్నారంటూ రాష్ట్రీయ ఉలామ కౌన్సిల్ (ఆర్ యూసీ) చైర్మన్ మౌలానా అమీర్ మాద్నీ ప్రశ్నించారు. ‘దైనిక్ జాగరణ్’ కథనం ప్రకారం అధినేత ములాయం, ఆయన కొడుకు అఖిలేష్ యాదవ్ ల హయాంలో యూపీలో ఎన్నో అల్లర్లు జరిగాయన్నారు. సెక్యులరిజం, కమ్యూనిజం పేరిట రాజకీయపార్టీలు ముస్లిం మతస్థులను మోసం చేస్తున్నాయన్నారు. బీజేపీనీ బూచిగా చూపి రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయంటూ ఆయన మండిపడ్డారు. ముస్లిం మతస్థులను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని విమర్శించారు. ఏ రాజకీయ పార్టీలైతే తమను మోసం చేస్తున్నారో వారికి ఓటు బ్యాంకు కాబోమన్నారు. ముస్లింలు, బ్రాహ్మణులు, భూమిహార్లు, రాజ్ పుట్ లు ఒక తాటిపైకి వస్తే కనుక తమ ఐక్యతను ఏ రాజకీయ పార్టీ కూడా దెబ్బతీయలేదన్నారు. ఈ ఓటు బ్యాంకు ద్వారా యాదవ్ లను సునాయాసంగా ఓడిస్తామని మౌలానా అమిర్ అభిప్రాయపడ్డారు.