: ఒడిదుడుకుల మధ్య స్థిరంగా సెన్సెక్స్, నిఫ్టీ... దూసుకెళ్లిన చిన్న కంపెనీలు!
సెషన్ ఆరంభంలో సూచికలు లాభాల్లోకి వెళ్లినప్పటికీ, ఆపై అమ్మకాల ఒత్తిడి ఎదురుకాగా, ఒడిదుడుకులను ఎదుర్కొన్న బెంచ్ మార్క్ సూచికలు దాదాపు స్థిరంగా నిలిచాయి. ఎఫ్ఐఐలు లాభాల స్వీకరణకు యత్నించినట్టు బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ గణాంకాలు వెల్లడించాయి. లార్జ్ కాప్ కంపెనీలు లాభాలను నమోదు చేయడంలో విఫలమైన వేళ, స్మాల్ కాప్ సెక్టార్ ఈక్విటీలు సత్తా చాటాయి. సెన్సెక్స్ కేవలం 0.11 శాతం లాభపడగా, స్మాల్ కాప్ సెక్టారు 0.64 శాతం పెరిగింది. బుధవారం నాటి ట్రేడింగ్ సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 27.82 పాయింట్లు పెరిగి 0.11 శాతం లాభంతో 25,844.18 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 0.05 పాయింట్లు పెరిగి 0.001 శాతం లాభంతో 7,914.75 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.10 శాతం, స్మాల్ క్యాప్ 0.64 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 29 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. టాటా స్టీల్, హిందాల్కో, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, గెయిల్ తదితర కంపెనీలు లాభపడగా, ఐడియా, ఇన్ ఫ్రాటెల్, టీసీఎస్, రిలయన్స్, అరవిందో ఫార్మా తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. బీఎస్ఈలో మొత్తం 2,770 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,477 కంపెనీలు లాభాల్లోను, 1,145 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 97,79,523 కోట్లకు పెరిగింది.