: నేటితరానికి ఎంతో ఆదర్శం ఈ అభినవ 'శ్రవణుడు'!


ఉమ్మడి కుటుంబాలు విఛ్చిన్నమైపోతున్నాయి. సినిమాల్లో తప్ప నిజ జీవితంలో ఉమ్మడి కుటుంబాలు కనబడడం లేదు...అదే సమయంలో మైక్రోఫ్యామిలీలు పెరిగిపోతున్నాయి. ఆస్తుల కోసం కన్నవారిని కడతేరుస్తున్నారు. ఇలాంటి కాలంలో పురాణాల్లోని శ్రవణుడిని గుర్తు చేస్తూ ఓ వ్యక్తి కన్న తల్లిని గత 20 ఏళ్లుగా కావడిపై మోస్తూ జన్మరుణం తీర్చుకుంటున్నాడు. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ కు చెందిన కీర్తీదేవి (92) చూపుకోల్పోయింది. అయితే ఆమెకు పుణ్యక్షేత్రాలు దర్శించాలని కోరిక. కీర్తీదేవి తన కోరికను 20 ఏళ్ల క్రితం కుమారుడు కైలాష్ (48) ముందుంచింది. దీంతో తల్లి కోరికను ఎలాగైనా తీర్చాలని భావించిన కైలాష్, యాత్రకు సరిపడా నిధులు లేకపోవడంతో కాలి నడకన 1996 ఫిబ్రవరిలో యాత్ర ప్రారంభించాడు. కళ్లు లేని తల్లిని కావడిలో ఒక తట్టలో కూర్చోబెట్టుకుని, మరో వైపు వారి జీవనానికి అవసరమైన పాత్రలు దినుసులు పెట్టుకుని వివిధ యాత్రాస్థలాలు సందర్శించడం మొదలుపెట్టాడు. అలా ఇప్పటి వరకు 36,582 కిలో మీటర్లు నడిచాడు . ఇంకొన్ని పుణ్యక్షేత్రాలు దర్శిస్తే తన యాత్ర పూర్తవుతుందని ఆయన తెలిపారు. తనకు 14 ఏళ్ల వయసులో చెట్టుపై నుంచి కిందపడగా, బతికే అవకాశం లేదని వైద్యులు తెలిపారని, తన తల్లి చేసిన పూజలు, సేవలు తనను బతికించాయని ఆయన పేర్కొన్నారు. తనకు 10 ఏళ్ల వయసులోనే తన తండ్రి, సోదరుడు మృత్యువాతపడ్డప్పటికీ తన తల్లి తనను పెంచి పెద్ద చేశారని, ఆమె రుణం తీర్చుకోవడానికి ఇంతకంటే మరొక అవకాశంలేదని ఆయన పేర్కొన్నారు. ఎంతో మంది తమకు యాత్రలో సహాయం చేశారని ఆయన తెలిపారు. తన తల్లిని తిరుపతి తీసుకువస్తానని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News