: ఒంటిమిట్టకు వెళుతున్న మంత్రి మాణిక్యాలరావుకు అస్వస్థత
నేటి రాత్రి కడప జిల్లా ఒంటిమిట్టలో జరగనున్న శ్రీ కోదండరామస్వామి కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు బయలుదేరిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మార్గమధ్యంలో అస్వస్థతకు గురయ్యారు. ఈ మధ్యాహ్నం తిరుపతి నుంచి ఆయన బయలుదేరగా, రాజంపేట వద్దకు వచ్చేసరికి తనకు ఒంట్లో బాగాలేదని చెప్పారు. దీంతో ఆయన్ను రాజంపేట రహదారులు, భవనాల శాఖ అతిథి గృహానికి తరలించిన అధికారులు స్థానిక వైద్యులచే ప్రథమ చికిత్స చేయించారు. ఆయన కొంత నీరసంగా ఉన్నారని, అంతకుమించి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం మాణిక్యాలరావు రాజంపేటలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.