: కర్ణాటకలో అమేజాన్ హోర్డింగ్, మండిపడ్డ కేరళీయులు!
కర్ణాటకలో అమేజాన్ తమ ప్రచారార్థం ఓ భారీ హోర్డింగును పెట్టగా, దానిపై కేరళ వాసులకు ఆగ్రహం కలగడం ఏంటని అనుకుంటున్నారా? అయితే, ఇది చదవండి. ఈ-కామర్స్ దిగ్గజం అమేజాన్, తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకునే దిశగా భారీ ఎత్తున హోర్డింగులు పెడుతూ వస్తోంది. ఇందులో భాగంగానే 'వుయ్ ఇండియన్స్ లవ్ హెల్పింగ్' అనే క్యాప్షన్ వాడుతూ, ఓ బస్సును వెనక నుంచి కొందరు ప్రజలు నెడుతున్న పెద్ద ఫోటోను ముద్రించింది. ఒకటీ, రెండు కాదు, బెంగళూరులోని చాలా ప్రాంతాల్లో ఇవే తరహా హోర్డింగులు నిలిపింది. ఇక్కడ సమస్య ఎక్కడొచ్చిందంటే, ఆ ఫోటోలో నెట్టబడుతున్న బస్సు కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థది కావడమే. తమ బస్సులు సరైన కండిషన్ లో నడవడం లేదన్న సంకేతాలు వెలువరించేలా ఈ హోర్డింగులు ఉన్నాయని కేరళ వాసులు తీవ్రంగా మండిపడటంతో, దిగివచ్చిన అమేజాన్, తమను క్షమించాలని కోరింది. ఆ హోర్డింగులన్నింటినీ తొలగిస్తామని చెప్పింది.