: నాన్ వెజ్ బిర్యానీలు... సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లో కాలేయ సమస్యలు!
వీకెండ్ వస్తే చాలు... లొట్టలు లేసుకుంటూ చికెన్, మటన్ బిర్యానీ లాగించేస్తున్నారా!, అయితే అనారోగ్యంపాలు కాక తప్పదు. ఈ అలవాటును అదుపులో ఉంచకపోతే కాలేయ సమస్యలతో ఇబ్బందిపడాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని పరిశోధకులు అంటున్నారు. ఈ మేరకు నిర్వహించిన తాజా పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఆల్కహాల్ తీసుకునే వారిలో మాత్రమే కాలేయ సమస్యలు వస్తాయనుకోవడం పొరపాటు అని అన్నారు. అదేపనిగా చికెన్, మటన్ బిర్యానీలు తినేవారిలో కూడా కాలేయ సంబంధిత సమస్యలు తలెత్తుతాయన్నారు. ఎటువంటి మద్యం అలవాట్లు లేకున్నా కాలేయ సమస్యలతో బాధపడేవారి సంఖ్య ప్రతి ఏడాది 30 నుంచి 35 శాతం వరకు పెరుగుతోందట. ముఖ్యంగా నగరాల్లో ఈ సమస్యలతో బాధపడేవారి సంఖ్య ఎక్కువగా ఉందని పరిశోధనలో తేలింది. వీకెండ్స్ లో నాన్ వెజ్ బిర్యానీ ఎక్కువగా తీసుకునే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కాలేయ సంబంధిత సమస్యలతో సతమతమవుతున్నారని పరిశోధనలో తేలింది. అకస్మాత్తుగా కడుపునొప్పి రావడం, ఛాతి నొప్పి, నీరసం వంటి లక్షణాలతో బాధితులు ఎక్కువగా ఆసుపత్రి పాలవుతున్న విషయాన్ని పరిశోధకులు ప్రస్తావించారు. బిర్యానీ తయారీకి వనస్పతి, నెయ్యి, డాల్డా, మసాలా వంటి దినుసులను ఎక్కువగా వినియోగించడం, నాణ్యత లేని మాంసాహారాన్ని వాడటం కారణంగా కాలేయ సమస్యలు వస్తుంటాయని చెబుతున్నారు. అంతేకాకుండా, ముఖ్యంగా రెస్టారెంట్లలో బిర్యానీ తినే సమయంలో దానితో పాటు కూల్ డ్రింక్ కూడా తీసుకోవడం ఫ్యాషన్ అయిపోయిందని... ఈ అలవాటు కారణంగా కాలేయసమస్యలు మరింత ఎక్కువవుతాయనే విషయం పరిశోధన ద్వారా తెలిసింది.