: పేదలకు ఆరోగ్య రక్ష.. సంచార వైద్య వాహనాలతో గ్రామీణ ప్రాంతాల్లో సేవలు: చంద్రబాబు
ప్రజలకు ఆరోగ్య రక్ష కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయవాడలో కొద్ది సేపటి క్రితం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఉచితంగా సీటీ స్కాన్ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రజల వద్దకే వెళ్లి చికిత్స అందించే సంచార చికిత్స సేవలను అందించనున్నామని తెలిపారు. సంచార చికిత్స సేవల్లో ఉచిత సీటీ స్కాన్ తో పాటు చిన్నారులకు ఇంజెక్షన్ ద్వారా పోలియో వ్యాక్సిన్ సేవలను అందించనున్నట్లు వెల్లడించారు. ప్రైవేటు వైద్యశాలలకు దీటుగా సర్కారీ వైద్యశాలల్లో సేవలు అందించాలని వైద్యులకు పిలుపునిచ్చారు.